ఇండియన్ మైఖైల్ జాక్సన్ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. ప్రభుదేవా ఆ పేరుకి ఎప్పుడో సార్థకత తీసుకొచ్చేశాడు. ఇప్పుడు లేడీ మైఖైల్ జాక్సన్ వచ్చింది. తనెవరో కాదు.. తమన్నా. తమన్నాని ఇప్పటి వరకూ మిల్కీ బ్యూటీ అని పిలిచేవారు. ఇప్పుడు లేడీ మైఖైల్ జాక్సన్ అనాల్సిందే. ఎందుకంటే.. ఆ స్థాయిలో స్టెప్పులేస్తోంది. తమ్మూ డాన్సుల్లో సూపర్ అనేది తెలిసిన విషయమే. చరణ్, బన్నీలాంటి సూపర్ డాన్సర్లు కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. ఇప్పుడు మరోసారి… అది నిజమని నిరూపించింది.
తమన్నా ప్రధాన పాత్రలో రూపుదిద్దుకొంటున్న చిత్రం అభినేత్రి. ఈ సినిమాకి సంబంధించిన తొలి టీజర్లో ప్రభుదేవా తన స్టెప్పులతో అదరగొట్టేశాడు. ఇప్పుడు టీజర్ 2 వచ్చింది. ఈసారి తమన్నా రఫ్ఫాడించేసింది. ఈ టీజర్లో స్టెప్పులు నభూతో.. న భవిష్యత్త్ అనే రేంజులో ఉన్నాయి. ఓ కథానాయిక ఈ స్థాయిలో స్టెప్పులేయడం ఇదే తొలిసారి. సినిమాలో ఇంకా ఉంటాయట. ప్రభుదేవాతో కలసి వర్క్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈసినిమా ఒప్పుకొన్నా అని తమన్నా చెబుతోంది. అలా ఎందుకు అందో… ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా తమన్నా స్టెప్పుల కోసమైనా చూడాలనిపించేలా తీర్చిదిద్దారు ఈ టీజర్‌ని. కావాలంటే మీరూ చూడండి.