ఏపికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వగైరాల కోసం పోరాడవలసి వస్తుంటే, తెలంగాణా హైకోర్టు విభజన, ఉద్యోగులు, నదీ జలాల పంపకాల కోసం పోరాడవలసివస్తోంది. అవన్నీ కూడా విభజన చట్టం ప్రకారం సహజసిద్ధంగా జరిగిపోవలసిన ప్రక్రియలే. కానీ వాటి కోసం కూడా పోరాడవలసి వస్తోంది. భాజపాకి మిత్రపక్షంగా, కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ తాము కూడా పోరాడాక తప్పడం లేదని తెదేపా ఎంపి శివప్రసాద్ అన్నారు.
కేంద్రంలో భాగస్వామిగా ఉన్నందునే రెండేళ్ళపాటు చాలా ఓపికగా ఎదురుచూశామని కానీ తమ సహనాన్ని కేంద్రప్రభుత్వం పిరికితనంగా, చేతగానితనం భావించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ళ క్రితం తాము రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీతో పోరాడితే, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మిత్రపక్షంగా ఉన్న భాజపాతోనే పోరాడవలసిరావడం చాలా దురద్రుష్టమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మరాజు వంటివారని, ఆయనకి ఎన్నడూ కోపమే రాదని, అటువంటి వ్యక్తికి కూడా కేంద్రప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరితో చాలా కోపం తెప్పించిందని అన్నారు. మిత్రధర్మం పాటించి ఇంత కాలం మౌనం వహిస్తున్నామే తప్ప గట్టిగా మాట్లాడలేక కాదు. ఇప్పటికీ కేంద్రప్రభుత్వం వైఖరి మారకుంటే తమ తడాఖా చూపిస్తామని శివప్రసాద్ కేంద్రప్రభుత్వాన్ని, భాజపాని కూడా గట్టిగా హెచ్చరించారు.
రాష్ట్ర విభజన అంశాన్ని పదేళ్ళు నాన్చడం వలన ఎటువంటి విపరీత పరిణామాలు సంభవించాయో చూసిన తరువాత కూడా కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా, రైల్వేజోన్ తదితర హామీల సంగతి తేల్చకుండా రెండేళ్ళు నాన్చింది. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలన్నట్లు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనుకొంటే, ఇప్పుడు చెపుతున్నట్లుగానే, మొదటే చెప్పేసి ఉంటే బహుశః సమస్య ఇంత జటిలం అయేది కాదేమో? కానీ ప్రజాగ్రహానికి భయపడి చెప్పలేదు. కనీసం తెదేపా అయినా ధైర్యం చేసి చెప్పగలిగి ఉంటే ఈ అపనిందలు భరించవలసి వచ్చేది కాదు. కానీ అది కూడా భయపడి ఈ విషయాన్ని దాచి పెట్టింది. తత్ఫలితంగా ఇప్పుడు స్వయంగా మిత్రపక్షంతో పోరాడవలసి వస్తోంది.
ఈ సమస్యని సృష్టించిన కాంగ్రెస్ పార్టీ దానిని ఒక ఆయుధంగా వాడుకొంటుంటే, తెదేపా, భాజపాలు ఆత్మరక్షణలో పడ్డాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఈ సమస్య నుంచి ఏవిధంగా బయటపడుతాయో చూడాలి.
తెదేపా ఒత్తిడి పెరగడంతో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజి ప్రకటించే ఆలోచన చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇవ్వాళ్ళ ఆయనతో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సమావేశమైనప్పుడు, ఆర్ధిక ప్యాకేజి ప్రస్తావన చేసినట్లు తెలిసింది. ఒకవేళ అదే నిజమనుకొంటే, అదే పని మొదటే చేసి ఉండి ఉంటే పరిస్థితులు ఇంతవరకు వచ్చేవి కావు కదా? పైగా ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మొన్న రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చకి సమాధానం చెపుతూ మిత్రపక్షం అడిగినంత మాత్రాన్న ఏపికి ఎక్కువ వేరే రాష్ట్రాలకి తక్కువ కేటాయిస్తే సమస్యలు వస్తాయని అన్నారు. కానీ మొన్న ఏది తప్పని అన్నారో ఇప్పుడు అదే చేయడానికి ఆలోచిస్తున్నారు.