హోదా సెంటిమెంటుగా మారితే పార్టీ నష్టపోతుందని గ్రహించిన తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ సెగ పార్టీకి తగలకుండా సురక్షితంగా బయటపడేందుకు బిజెపిని ముద్దాయిగా నిలబెట్టే వ్యూహానికి తెరలేపినట్లు పార్టీ ఎంపిల వ్యవహారశైలి, విమర్శల ధోరణి స్పష్టం చేస్తోంది.
ఎంపిలంతా బిజెపికి వ్యతిరేకంగానే మాట్లాడటం బాబు వ్యూహాత్మక నిర్ణయాలను స్పష్టం చేస్తోంది. చంద్రబాబు నేరుగా బిజెపిని విమర్శించకుండా ప్రభుత్వాధినేతగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానన్నారు. మరోవైపు తన పార్టీ నేతలతో బిజెపిపై రాజకీయంగా విమర్శలు చేయిస్తున్నారు. ఇంకోవైపు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా హోదా సహా అన్ని అంశాలపై చర్చించామని మీడియాకు చెబుతున్నారు. ఇవన్నీ కూడా హోదాపై తెదాపా తప్పులేదన్న సంకేతాలే ఇస్తున్నాయి.
ఇదొక ద్విముఖ వ్యూహం…రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి చేస్తున్న యత్నాలకు హోదాతో బ్రేకులు వేసి ఆ పార్టీని బలహీనపరచడం, తాము మిత్రపక్షమైనా కేంద్రంతో పోరాడుతున్నామన్న సంకేతాలివ్వడం ద్వారా పూర్తి డిఫెన్స్ గేమ్ ఆడాలని నిర్ణయించుకోవడం. టిడిపి వ్యూహాలు.
కేంద్రం నిర్ణయంపై అప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రధానికి విషయాలు చెప్పి ఆయన నిర్ణయాన్ని బట్టి ముందుకెళదామని టిడిపి పార్లమెంటు సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తొందరపడి ఎవరూ నోరుజారొద్దని, విడిపోయి చేసేదేమీ ఉండదని స్పష్టం చేశారు. టిడిపి పార్లమెంటరీ పార్టీ ఆదివారం నాడు సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్రం తీరును రాష్ట్రంలో ఎండగట్టే విధంగా చేయాలని, అదే సమయంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి సరికాదని అన్నట్లు తెలిసింది. ఎలా నష్టపోయామో ప్రజలకు వివరించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి ముందుకెళ్లాలని, అనవసర వ్యాఖ్యానాలు ఎవరూ చేయొద్దని తెలిపారు.
ముఖ్యంగా నిధుల విషయంలో బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మోడీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మోడీని అపాయింట్మెంట్ అడిగి ఆయన నిర్ణయం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ తీసుకుందామని ఎంపిలకు తెలిపారు. ఆయన అనుమతి వచ్చి మాట్లాడే వరకూ పార్లమెంటులో ఎటువంటి ఆందోళనా కార్యక్రమాలు చేయొద్దని చెప్పినట్లు తెలిసింది. మోడీ నిర్ణయం సరిగా లేకపోతే ఏం చేయాలో ఆలోచిద్దామని, తొలి విడతగా ప్రశాంత నిరసన వ్యక్తం చేయాలని చెప్పినట్లు సమాచారం.
రాష్ట్రంలో ఆందోళనలు, ఆగ్రహాల వల్ల కేంద్రానికి తెలిసేమీ ఉండదని, కేంద్రం ఇబ్బంది పడే విధంగా ఇక్కడ కార్యక్రమాలుండాలని చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో హోదాపై మోడీ వ్యాఖ్యానాలు చేయగానే పలువురు ఎంపిలు విడిపోవడం మంచిదనే విధంగా మాట్లాడినట్లు మీడియాలో వచ్చిందని, ఇది సరైన ధోరణి కాదని హెచ్చరించినట్లు తెలిసింది. ముఖ్యంగా జెసి దివాకరరెడ్డి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపినట్లు సమాచారం. ఇప్పటికిప్పుడుగా విడిపోతే వచ్చే ఉపయోగమూ ఏమీ లేదని, ఎంపిలు సామరస్యంగా వ్యవహరించాలని సిఎం సూచించారు. దీంతోపాటు జాతీయ స్థాయిలో కలిసొచ్చే పార్టీలనూ కలవాలని, మోడీ నుండి సరైన హామీ లేకపోతే భవిష్యత్ కార్యాచరణకు వీలుగా వారితో చర్చలు జరపాలని సూచించినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా కేంద్రం నుండి విడిపోవాలనే ఆలోచన నుండి ఎంపిలు బయటకు రావాలని అన్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే పార్టీ అధికార ప్రతినిధులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు హోదా అంశంలో బిజెపిపై విమర్శలు చేసేందుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేంద్రాన్ని మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదని, మన సహనానికీ హద్దు ఉందని బాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. హోదాపై మనకు పోరాడే హక్కు ఉన్నప్పుడు మొహమాటం అవసరం లేదని, స్నేహం వేరు రాజకీయాలు వేరని స్పష్టం చేశారు. అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కూడా బిజెపిపై తన అసంతృప్తిని ఎక్కడా దాచుకునే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాతనే తెదేపా ఎంపిలు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు బిజెపిపై స్వరం మారింది.
హోదాపై బిజెపి వైఖరిని జీర్ణించుకోలేని బాబు కొంతకాలం వ్యూహాత్మక వౌనం వహించారు. ఆ తర్వాత ఆ అంశంపై పోరాడే వ్యక్తులు, సంస్థలకు పరోక్ష మద్దతునిచ్చారు. కెవిపి ప్రైవేట్ మెంబర్ బిల్లుపై బాబు అనేకసార్లు సీనియర్లతో భేటీ అయ్యారు. కొందరు వ్యతిరేకించినా కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో ఆ పార్టీ కోలుకోవటం కష్టమని, మనం బిజెపితో నేరుగా యుద్ధం చేయలేని పరిస్థితి ఉన్నందున, రాజకీయంగా ప్రజలకు సానుకూల సంకేతాలు పంపాలంటే కెవిపి బిల్లుకు మద్దతు ప్రకటించడమే సరైన వ్యూహమని బాబు సీనియర్లకు నచ్చచెప్పారు.
బిజెపిలో కూడా బాబు వైఖరిపై అసంతృప్తి కనిపిస్తోంది. మేధావుల ఫోరంతోపాటు, కెవిపి ప్రైవేటు బిల్లు వెనుక బాబు ఉన్నారని, ఆయనే తెరవెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారని బిజెపి నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. తొలుత కెవిపి ప్రైవేటు బిల్లు చర్చకు వచ్చిన సమయంలో బిజెపికి చెందిన ఓ ప్రముఖుడు ఇదే విషయాన్ని జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. కెవిపి బిల్లు వెనుక ఉన్న వ్యక్తులపై బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి బాహాటంగానే విమర్శలు చేశారు.