గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ సోమవారం రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి పంపించారు. దానిని ఆమోదిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో తనకి 75సం.లు నిండుతాయని కనుక స్వచ్చందంగా తప్పుకొంటున్నట్లు ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశమయ్యి ఆమె స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని నియమిస్తుందని అమిత్ షా తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో సౌరబ్ పటేల్, నితిన్ భాయ్ పటేల్, విజయ్ రూపాణిలు ఉన్నారు.
ఆమె తన రాజీనామాకి వయసు, ఆరోగ్యం కారణాలుగా పేర్కొంటున్నప్పటికీ అసలు కారణాలు వేరే కనిపిస్తున్నాయి. హార్దిక్ పటేల్ మొదలుపెట్టిన రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా గుజరాత్ లో హింస చెలరేగినప్పుడు దానిని అదుపు చేయడంలో ఆనందీ బెన్ వైఫల్యం చెందడం, మళ్ళీ ఇటీవల దళిత యువకులపై దాడులు, ఆ కారణంగా రాష్ట్రంలో దళితులు ఉద్యమం మొదలుపెట్టడంతో కేంద్రప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది.
వచ్చే ఏడాది గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ శాసనసభలకి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి కీలక సమయంలో రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం పట్ల క్రమంగా వ్యతిరేకత పెరుతుండటంతో భాజపా అధిష్టానం ఆందోళన చెందడం సహజమే. గుజరాత్ లో దళితులపై జరిగిన దాడులు, వారి ఉద్యమాల ప్రభావం కేవలం గుజరాత్ కే పరిమితం కావు. అవి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలపై చాలా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ లో ప్రతిపక్ష నేత బి.ఎస్.పి అధినేత మాయావతి ఇప్పటికే ఆ ఘటనలని అందిపుచ్చుకొని భాజపాపై ఎదురుదాడి మొదలుపెట్టారు. దాని వలన ఆ రాష్ట్రంలో కూడా భాజపాకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.
గుజరాత్ లో గత 21 ఏళ్లుగా భాజపాయే అధికారంలో ఉంది. గుజరాత్ రాష్ట్రాన్ని భాజపా ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దేశంలో నెంబర్:1 స్థానంలో నిలిపింది కనుకనే ప్రజలు భాజపాకి పట్టం కడుతున్నారని భాజపా గొప్పగా చెప్పుకొంటోంది. కానీ గత ఏడాదిగా గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి ఘటనలతో మోడీ ప్రభుత్వం కూడా తలదించుకోవలసివస్తోంది. ప్రతిపక్ష పార్టీలకి సంజాయిషీలు చెప్పుకోవలసి వస్తోంది. భాజపాకి కీలకమైన గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ శాసనసభ ఎన్నికలకి ముందు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఆనందీ బెన్ రాజీనామా చేయమని భాజపా అధిష్టానం కోరి ఉండవచ్చు.