ప్రత్యేక హోదా.. ఈ అంశంపై రెండు సంవత్సరాలుగా రాజకీయ పార్టీల విన్యాసాలను చూస్తూనే ఉన్నారు సీమాంధ్ర ప్రజలు. రాష్ట్ర విభజన పట్ల సీమాంధ్రలో వెల్లువెత్తిన వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్లు ఆ సమస్య కు పరిష్కారంగా “ప్రత్యేక హోదా’’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని, హైదరాబాద్ ను కోల్పోతున్న సీమాంధ్ర పారిశ్రామీకకరణకు ప్రత్యేక హోదా ఎంతో ఉపయుక్తం కానున్నదని కాంగ్రెస్ వాళ్లు వాదించారు. అయితే అప్పట్లో ఏపీ జనాలు “ప్రత్యేకహోదా’’ అనే మాటను పట్టించుకునే దశలో లేరు. విభజన జరగకూడదు.. సమైక్యాంధ్ర ఉండాలి అని వాదిస్తున్న మూడ్ లో ఉన్నారు సీమాంధ్రులు. ప్రత్యేక హోదా ఎంత ప్రాముఖ్యతతో కూడుకున్నది అయినా.. దాంతో మాకు పని లేదు, విభజన చేయకూడదనే హడావుడిలో ఉండగానే విభజన జరిగిపోయింది!
విభజన బిల్లు పై లోక్ సభలో జరుగుతున్న సమయంలో కూడా విభజనకు వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు, హర్తాళ్ లు జరిగాయి కానీ.. ప్రత్యేక హోదా అంశం ఎవరికీ అవగాహనా లేదు, దాని గురించి ఆలోచించే తీరికా లేదు. అయితే విభజనకు అనుకూలంగా నిలిచిన రెండు రాజకీయ పార్టీలు.. కాంగ్రెస్ , బీజేపీలు మాత్రం “ప్రత్యేకహోదా’ అంశం గురించి మాట్లాడాయి. విభజనతో ఏపీకి జరిగే నష్టానికి ప్రత్యామ్నాయం హోదానే అని కాంగ్రెస్ వాదించగా, బీజేపీకి కూడా ఇదే వాదనను వినిపించింది. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమని.. ఏపీకి ఐదు కాదు, పది, పదిహేనేళ్ల పాటు హోదా ఇవ్వాలని బీజేపీ వాళ్లు వాదించిన విషయాన్ని ఎవ్వరూ మరవలేరు!
ప్రత్యేక హోదా అంశం గురించి స్థూలంగా చెప్పాలంటే.. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ లు రెండూ ప్రత్యక్షమైన దోషులే. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రకటించిన కాంగ్రెస్ వాళ్లు దాన్ని విభజన బిల్లులో పొందు పరచకుండా ఒకరకంగా అన్యాయం చేస్తే.. ఎన్నికల ముందు..మేమొస్తే ఏపీకి ప్రత్యేక హోదా అంటూ ఊరించిన కమలనాథులు ఇప్పుడు పూర్తిగా అడ్డం తిరిగారు. ఈ విషయంలో దోషి కాంగ్రెస్సే అంటూ పొద్దు పుచ్చేయత్నం చేస్తున్నారు కమలనాథులు.
తాము హామీని ఇచ్చామనే విషయాన్ని పక్కన పెట్టి, బిల్లులో పొందు పరచలేదు అందుకే ప్రత్యేక హోదా సాధ్యం కావడం లేదని కమలం పార్టీ బుకాయించాలని చూస్తుండటం నిజంగా విశేషం. ఇలాంటి పార్టీకా మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రులు అంతగా అండగా నిలిచింది అనే కన్ఫెషన్ మొదలైంది!
మరి కాంగ్రెస్ ను ఎన్నుకుంటే.. విభజన చేసి ద్రోహం చేసింది, కమలానికి అండగా నిలిస్తే..ఇప్పుడు ఈ పార్టీ ఇలా ద్రోహం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ జనాల మదినిండా ఆందోళనే నిండినా, రాజకీయ పార్టీల వేషాలను చూస్తుంటే మాత్రం వారి అభిలాష నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఇక ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కూడా తమ రాజకీయాలు తాము చేసుకొంటూ ఉన్నాయి. తెలంగాణ కోసం అక్కడి పార్టీలు ఏకమై పోరాడిన పరిస్థితి ఏపీలో కనిపంచడం లేదు. హోదా విషయంలో పోరాటంలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ లు పరస్పర నిందారోపణలు చేసుకొంటూ పబ్బం గడుపుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో.. రోడ్ల మీదకు రావడం, నిరసనలు ధర్నాలు చేయడం ఆంధ్రుల మనస్తత్వానికి కొంచెం విరుద్ధమైనవి. తెలంగాణ ప్రజల్లో ఉన్నంతటి ఈ తరహా తెగింపు ఆంధ్రా, సీమల్లో లేదనే చెప్పాలి. ప్రత్యేక హోదా తీవ్రతను కేంద్రానికి తెలియ జెప్పడానికి సీమాంధ్రులు కనీసం ఒక్క రోజు అయినా బంద్ పాటిస్తారనే నమ్మకం లేదు.
కానీ.. ఏపీ ప్రజలు ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో తమ నిరసన స్వరాన్ని వినిపించడానికి ఒక అవకాశం ఉంది. అదే సోషల్ నెట్ వర్కింగ్! ఏపీకి బీజేపీ, కాంగ్రెస్ లు ఏ విధంగా ద్రోహం చేశాయి.. విభజన పరిణామాలు, ఎన్నికల సమయంలో ఏపీకి కమలం, కాంగ్రెస్ లు ఇచ్చిన హామీలేమిటీ.. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? అనే అంశాల గురించి వివరించే అవకాశం ఉంది సోషల్ మీడియా ద్వారా. ఎలాగూ.. నేతల హామీల వీడియోలు, పార్టీల మెనిఫెస్టులు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.. వీటన్నింటికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి.. హ్యాష్ ట్యాగ్ లను ఆధారంగా చేసుకుని ప్రత్యేకహోదా అంశం గురించి పోస్టులు పెట్టి.. ఈ అంశాన్ని ట్రెండింగ్ లోకి తీసుకురావడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉండవచ్చు.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. సోషల్ నెట్ వర్కింగ్ అంటే బీజేపీకి భయభక్తులున్నాయి. దీని పవరేమిటో కమలం పార్టీకి తెలుసు. ఇంటర్నెట్ ద్వారా విస్తృతమైన ప్రచారం ద్వారానే బీజేపీ గత ఎన్నికల్లో చాలా ఉపయోగం పొందింది. ఇలాంటి నేపథ్యంలో అదే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో బీజేపీ తీరును ఎండగడితే.. దానికి ఎలాగూ జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఏపీ ప్రత్యేక హోదా అంశం గురించి రాజకీయ నేతలు నిజాయితీగా పోరాడటం ఎంత ముఖ్యమో.. ప్రజలు కూడా తమ వంతుగా తమ సమస్యను హైలెట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్ల మీదకు దిగి నిరసనలు తెలపకపోయినా.. కనీసం ఈ రకంగా నిరసన తెలపడం ద్వారా సీమాంధ్రులు తమ పరిస్థితిని తెలియజేయవచ్చు. అధికారంలో ఉన్నవారికి పరిస్థితిని అర్థమయ్యేలా చేయవచ్చు.