ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన ఏ రాజకీయ సంఘటన జరిగినా, ప్రతిపక్ష పార్టీలు మరిచిపోకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తుంటాయి. ప్రత్యేక హోదా గురించి రాష్ట్రంలో, డిల్లీలో ఇంత చర్చ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం దానితో తనకి అసలు సంబంధం లేనట్లుగా సినిమాలు చేసుకొంటున్నారని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఎన్నడూ కేంద్రాన్ని ఒత్తిడి చేయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దానికోసం ఇప్పుడు ఒత్తిడి చేస్తున్నారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నోరు మెదపడం లేదని విమర్శించారు. ఆయన మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోయినా కనీసం ప్రత్యేక హోదా ఇమ్మని కోరవచ్చు కదా? ఆ పని కూడా చేయకపోతే పవన్ కళ్యాణ్ చరిత్ర హీనుడు అవుతారని రామకృష్ణ అన్నారు.
పవన్ కళ్యాణ్ కి ఇటువంటి ప్రశ్నలు, విమర్శలు తరచూ ఎదురవుతూనే ఉన్నాయి కానీ ఆయన ఏనాడూ వాటిపై స్పందించలేదు. కనీసం పట్టించుకొన్నట్లు కనబడలేదు. ఆయన పూర్తిగా తన సినిమాలు, ఫార్మ్ హౌస్ పనులకే అంకితం అయిపోయారు. ఆయన ఇటువంటి అంశాలపై ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేసినా దానిని బట్టి ఆయన అభిమానులు స్పందించడానికి సిద్దంగా ఉన్నారు. కానీ ఆ చిన్న పని కూడా చేయడం లేదు. ఆయన రాష్ట్ర రాజకీయాలకి దూరంగా ఉండటం గమనిస్తే మళ్ళీ రాజకీయాలలోకి తిరిగి వస్తారో లేదో అనే అనుమానం కలుగుతోంది. కనీసం ఆ విషయంపై స్పష్టత ఇచ్చినా ఇటువంటి విమర్శల బాధ తప్పేది కదా!
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తో పోలిస్తే ఆయన సోదరుడు చిరంజీవి చాలా నయం అని చెప్పక తప్పదు. ఆయన కూడా పార్ట్ టైం ప్రజాసేవ, రాజకీయాలు చేస్తున్నప్పటికీ, అవకాశం చిక్కినప్పుడల్లా రాష్ట్ర రాజకీయాలకి సంబంధించి ప్రతీ విషయంపైనా తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినపుడు రాజ్యసభకి వెళ్లి హాజరు వేయించుకొని వస్తుంటారు కూడా!