జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ మరొక్కమారు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి తన ట్వీటర్ ద్వారా “రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి బలవంతంగా భూసేకరణ చేయవద్దని” ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. నాలుగు రోజుల క్రితం కూడా ఆయన ఇదే విజ్ఞప్తి చేసారు. దానిపై స్పందించిన రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తాము రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేయబోమని, రైతులను ఒప్పించి తీసుకొంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మళ్ళీ నిన్న ఈవిధంగా విజ్ఞప్తి (హెచ్చరిక) చేయడం చూస్తే ఆయన ఆ హామీని నమ్మినట్లులేదని స్పష్టమవుతోంది.
ఈనెల 20వ తేదీ నుండి రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించి మిగిలిన భూసేకరణ కార్యక్రమం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీ.ఆర్.డి.ఏ. సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. భూసేకరణకు సమయం దగ్గిరపడుతున్నందున పవన్ కళ్యాణ్ మళ్ళీ మరో మారు స్పందించినట్లున్నారు. కనుక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే పవన్ కళ్యాణ్ ఈసారి రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రతిపక్ష పార్టీలు దీనిపై ఎంత రాద్ధాంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చును. కానీ తమకు మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ స్వయంగా దీనిని వ్యతిరేకిస్తూ పోరాటం మొదలుబెడితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. వీలయినంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ నుంచి రాజధాని నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి సిద్దమవుతున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ట్వీట్లు విజ్ఞప్తి చేస్తున్నట్లు కాక రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసురుతున్నట్లే భావించవచ్చును. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు చేసిన ట్వీట్ మెసేజ్ లో “రైతులతో మాట్లాడి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళమని” రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కానీ రైతుల కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఆయనతోనే ఈ సమస్య గురించి సామరస్యంగా చర్చించి ముందుకు వెళ్ళవలసి ఉంటుందేమో? లేకుంటే ఆయన పోరాటానికి దిగితే అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడవచ్చును. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను ఏవిధంగా సామరస్యంగా పరిష్కరించుకొంటుందో వేచి చూడాలి.