ఏలిన వారి నిర్వాకం వల్ల ఎంసెట్ 2 పేపర్ లీకైంది. ఆ పరీక్షను రద్దు చేసి ముచ్చటగా మూడోసారి పరీక్ష జరపాలని నిర్ణయించారు. కానీ దాన్ని ప్రకటించడానికి మాత్రం ఇంకా సమయం ఆసన్నం కాలేదు. సోమవారమైనా అధికారిక ప్రకటన వస్తుందనుకున్నారు. షెడ్యూల్ విడుదలైతే ఆ ప్రకారం పరీక్షకు సిద్ధం కావడానికి విద్యార్థులక స్పష్టత ఉంటుంది. కానీ మంగళవారం ప్రకటన చేసే అవకాశం ఉంది.
ప్రశ్న పత్రం లీకైంది కాబట్టి ఎంసెట్ 2 ను రద్దు చేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అది మంగళవారం విచారణకు రావచ్చు. దానిపై హైకోర్టు ఏం చెప్తుందనే దాన్ని బట్టి ప్రభుత్వం పరీక్ష రద్దు, కొత్త షెడ్యూల్ పై ప్రకటన చేయాలని భావిస్తోంది. అప్పటి వరకూ ఉత్కంఠ తప్పదు.
ఇప్పటికే ఇంటర్ పరీక్షల తర్వాత రెండు ఎంసెట్ లు, ఒక నీట్ రాసిన విద్యార్థులకు ఇప్పుదు టెన్షన్ టెన్షన్. మళ్లీ ఎప్పుడు పరీక్ష పెడతారనే స్పష్టత కూడా ఇంకా రాలేదంటే వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు చివరి వారంలో పరీక్ష నిర్వహించాలనేది ప్రభుత్వ యోచన. అది వీలు కాకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తారు. వారం రోజుల్లో ఫలితాలు వెల్లడించి, వెంటనే కౌన్సెలింగ్ మొదలుపెట్టాలని యోచిస్తున్నారు.
రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి ఉన్నారు. వైద్య శాఖకు మంత్రి ఉన్నారు. మరి ఎంసెట్ లీకేజీ తర్వాత కూడా వారిద్దరిలో ఏ ఒక్కరూ బాధ్యులు కాదనే తరహాలో ప్రభుత్వం వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఎవరూ బాధ్యులు కాకపోతే ప్రభుత్వం మొత్తానికి ఉమ్మడి బాధ్యతా? అసలు దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని కూడా కొందరు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఒకప్పుడు ఏ ఆరోపణలు బయటకు రాకపోయినా ఓ మంత్రిని తొలగించిన కేసీఆర్ ఇప్పుడు కడియం శ్రీహరి విషయంలో మాత్రం ఎందుకు అలా స్పందించడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక్కో మంత్రికి ఒక్కో విధమైన రూల్స్ ఉంటాయా అని ఎద్దేవా చేస్తున్నారు.
బాధ్యుల సంగతి తర్వాత, ముందు విద్యార్థులకు స్పష్టత ఇవ్వడం ముఖ్యం. ఇంకా వాళ్లను టెన్షన్ పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. షెడ్యూల్ ను ప్రకటించి, ఈసారైనా కాస్త ప్రింటింగ్ ప్రెస్ దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేసి పక్కాగా మూడోసారి పరీక్ష నిర్వహించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.