ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఈరోజు రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నాయి. దానిని తప్పుపడితే ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందనే భయంతో తెదేపా నేతలు ఎవరూ బంద్ ని వ్యతిరేకిస్తూ గట్టిగా మాట్లాడటం లేదు కానీ ప్రత్యేక హోదా పేరుతో ప్రతిపక్ష పార్టీలు రాజకీయ మైలేజ్ కోసం ప్రాకులాడుతున్నాయని విమర్శిస్తున్నారు. డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నాలు చేసి నిలదీయకుండా రాష్ట్రంలో ఎందుకు డ్రామాలు ఆడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. తెదేపా ఎంపిలు పార్లమెంటు లోపలా బయటా ఆందోళన చేస్తూ కేంద్రప్రభుత్వాన్ని నిలదీసి ఆర్ధిక ప్యాకేజి సాధించబోతుంటే, ఇప్పటికే తీవ్ర ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఇటువంటి బంద్ వలన ప్రత్యేక హోదా రాదు కానీ ఇంకా నష్టం జరుగుతుందని వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే చెపుతున్నారు. కనుక ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ధర్నాలు, బంద్ లు చేయడం కంటే డిల్లీ వెళ్లి చేయడమే మంచిదని తెదేపా అభిప్రాయంగా భావించవచ్చు.
కానీ అందుకు భిన్నంగా గుంటూరు జిల్లా పొన్నూరు తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఇవ్వాళ్ళ తన నియోజక వర్గంలో ప్రత్యేక హోదా కోసం ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రత్యేక హోదా సాకుతో ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని, దాని నుంచి మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నాయని, రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నాయని తెదేపా వాదిస్తున్నప్పుడు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈవిధంగా దీక్ష చేయడం దేనికి? అంటే ఆయన కూడా ప్రజలని ఆకట్టుకోవడానికే దీక్ష చేస్తున్నారని భావించవలసి ఉంటుంది. లేదా తన నియోజక వర్గంలో ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే, తను చేతులు ముడుచుకొని కూర్చొంటే, ప్రజల ముందు చెడ్డవాడైపోతాననే భయం వలన కావచ్చు. కారణాలు ఏవైనప్పట్టికీ, ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు బంద్ చేస్తుంటే, అధికార పార్టీకి చెందిన ధూళిపాళ తన ప్రత్యేక దీక్షతో ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అనుమతి తీసుకొనే దీక్షకి కూర్చొని ఉంటే, అప్పుడు ప్రతిపక్ష పార్టీలని ప్రభుత్వం తప్పుపట్టకూడదు.