ఎంసెట్-2 పరీక్షలని రద్దు చేసినట్లు తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. ఎంసెట్-2 ప్రశ్నాపత్రాల లీకేజీపై దర్యాప్తు చేస్తున్న సిఐడి పోలీసులు, దిగ్బ్రాంతి కలిగించే విషయాలు కనుగొన్నారు. డిల్లీ కేంద్రంగా సాగిన ఈ చీకటి వ్యవహారంలో మొత్తం 34మంది బ్రోకర్లు, సుమారు 200 మంది విద్యార్ధులు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ కుంభకోణంలో ముకుల్ జైన్, మయాంక్ శర్మ, సునీల్ సింగ్, ఇర్ఫాన్ అనే నలుగురు బ్రోకర్లు ప్రధాన పాత్రధారులని సిఐడి పోలీసులు గుర్తించారు. ఇంతవరకు ఆరుగురు బ్రోకర్లుని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు. అరెస్ట్ చేసిన బ్రోకర్ల ద్వారా ప్రశ్నా పత్రాలు పొందిన విద్యార్ధులు, వారి తల్లితండ్రులందరి వివరాలు సిఐడి పోలీసులు కనుగొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యార్ధులు, వారి తల్లి తండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టడానికి సిఐడి పోలీసులు సిద్దం అవుతున్నట్లు సమాచారం.
ఎం.బి.బి.ఎస్. డెంటల్ వంటి వైద్యసంబంధిత కోర్సులకి మన దేశంలో విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ డిమాండ్ కి అనుగుణంగా తగినన్ని సీట్లు లేకపోవడం వలననే ఇటువంటి విపరీత ఆలోచనలు, ప్రయత్నాలు జరుగుతుంటాయి. అదే అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఉండే ఇంజనీరింగ్ కోర్సుల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షలలో ఇటువంటి కుట్రలు జరుగడం చాలా అరుదు. ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించినంత సులువుగా మెడికల్ కాలేజీలు స్థాపించడం సాధ్యం కాదు కనుకనే దేశంలో మెడికల్ సీట్లు పెరగడం లేదు. డిమాండ్-సప్లైలో బారీ తేడా ఉన్న ప్రతీ చోట ఇటువంటి సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వాటి మధ్య నానాటికీ పెరిగిపోతున్న ఈ గ్యాప్ ని ఏవిధంగా భర్తీ చేయాలో ఆలోచించాల్సి ఉంటుంది.
ఇక ఈ కుంభకోణంలో ఏకంగా 34మంది బ్రోకర్లు, 200మంది విద్యార్ధులు ఉండటం గమనిస్తే, ఇది ఏ స్థాయిలో జరుగుతోందో ఊహించవచ్చు. “దీని వెనుక ఎంత పెద్దవారు ఉన్నప్పటికీ ఉపేక్షించము” అనే పడికట్టు డైలాగ్ తో సరిపెట్టకుండా అందరినీ వెతికి పట్టుకొని న్యాయస్థానం ముందు నిలబెట్టడం చాలా అవసరం. లేకుంటే ఈ కుట్రలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా త్వరలో నిర్వహించబోయే ఎంసెట్-3లో మళ్ళీ ఇటువంటి తప్పులు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఒకవేళ మళ్ళీ ఇటువంటి తప్పు జరిగితే, ఈసారి తెలంగాణా ప్రభుత్వం తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.