తమన్నా… ఈ మిల్కీ బ్యూటీ కాల్షీట్లు కావాలంటే ఏకంగా కోటి రూపాయలు సమర్పించుకోవాల్సిందే. డిమాండ్ ని బట్టి ఈ రేటు కూడా పెరుగుతుంటుంది. తమన్నాతో స్పెషల్ సాంగ్ అంటే కనీసం అరకోటి రాసేయాలి. లేదంటే…. తమన్నా కాల్షీట్లు దొరకడం కష్టం. అయితే.. అభినేత్రి కోసం తమన్నా తీసుకొన్నది కేవలం.. రూ.30 లక్షలట. ”మీరు ఎంతిస్తే అంత ఇవ్వండి.. నాకేం అభ్యంతరం లేదు.. ఫ్రీగా చేయమన్నా చేస్తా” అనేసిందట తమన్నా. ఎవ్వరికీ ఇవ్వని రిబేటు తమన్నా ఈ సినిమాకే ఎందుకిచ్చినట్టు? తమన్నా ఎవరికి పడిపోయినట్టు??
విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు.. ప్రభుదేవా నిర్మాణ భాగస్వామి కూడా. ప్రభుదేవా చొరవ వల్లే తమన్నా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొందట. ఈ విషయాన్ని తమన్నానే చెప్పింది. తమన్నాలో ఓ మంచి డాన్సర్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుదేవాకి తమన్నా వీరాభిమాని. తన డాన్స్ డైరెక్షన్లో కనీసం ఓ పాటకైనా స్టెప్పులేయాలని తమన్నా ఎప్పటి నుంచో అనుకొంటోందట. అందుకోసమే కనీసం కథ కూడా వినకుండా తమన్నా ఈ ప్రాజెక్టుపై సంతకం చేసిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి పనిచేస్తున్న నటీనటులు, సాంకేతిక సిబ్బంది అందరూ.. పారితోషికం తగ్గించుకొని సినిమా కోసం పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఆ విషయంలోనూ భారీ రిబేట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పుడు తమన్నా కూడా అదే చెబుతోంది. ”కొన్ని సినిమాలు పారితోషికం కోసం చేయకూడదు. సినిమా అనేది ప్యాషన్. మంచి సినిమాల కోసం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు” అంటోంది.