75 యేళ్ల వయసు దాటిన వారెవరూ కీలక పదవుల్లో ఉండకూడదు..అనేది బీజేపీ తన రాజ్యాంగంలో ఇటీవల చేర్చుకున్న క్లాజు. ప్రధానంగా మోడీ ప్రధానమంత్రి అయ్యాకా.. క్యాబినెట్ ను ఫామ్ చేసుకునే క్రమంలో ఈ నియమాన్ని పెట్టకున్నారు. దీని ప్రధాన ఉద్దేశం అద్వానీ వంటి వారిని ప్రధానమంత్రి పదవికీ దూరంగా పెట్టడం, పార్టీలోని ఇతర సీనియర్ల ను తన కేబినెట్ లోకి తీసుకునే బాధను తప్పించుకోవడం కోసమే అంటారు కొంతమంది. అయితే మోడీ మాత్రం ఈ నియమాన్ని స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు.
ఈ నియమానికి అనుసరించే గుజరాత్ సీఎం పదవికి ఆనందీ బెన్ పటేల్ రాజీనామా చేశారు. త్వరలో ఆమె 75 యేళ్లను క్రాస్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు గుజరాత్ ఇప్పుడు బీజేపీకి అత్యంత కీలకమైన రాష్ట్రం. ఇన్నేళ్లూ అక్కడ సాగించిన విజయయాత్ర సంగతెలా ఉన్నా..వచ్చే ఏడాది జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటకపోతే బీజేపీ చాలా ఇబ్బందులే పడుతుంది. ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రం లో ఇప్పటి వరకూ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.
ఒకవైపు పటేళ్లు రిజర్వేషన్ల ఉద్యమంతో కమలం పార్టీకి మచ్చెమటలు పట్టించారు. మరోవైపు ఇన్నేళ్ల పాలనపై ఎంతో కొంత ప్రజావ్యతిరేకత కూడా ఉండనే ఉంటుంది. ఇన్నేళ్లూ మోడీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్లి గుజరాత్ కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో అనందీ బెన్ తగు సమర్థతను చూపలేకపోయింది కూడా! మరి ఇప్పుడు ఆ రాష్ట్ర సీఎం పదవిని అమిత్ షా చేపట్టనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వేరే వాళ్ల పేర్లూ ఈ విషయంలో వినిపిస్తున్నా.. షా పేరు చాన్నాళ్ల నుంచే వినిపిస్తోంది. మోడీకి నమ్మకస్తుడు, ట్రబుల్ షూటర్ అయిన షా గుజరాత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించి ఎన్నికల నాటికి పార్టీని సన్నద్ధం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి ఇదే జరిగితే షా అత్యంత కీలకమైన బాధ్యతలు స్వీకరిస్తున్నట్టే… సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించడం మాట ఎలా ఉన్నా.. అంతకు మించిన పరీక్ష గుజరాత్ ఎన్నికలు.