ప్రభుత్వాలు చాలా ఆర్భాటంగా నిత్యం ఏవో కొత్త కొత్త పధకాలు ప్రకటిస్తుండటం, వాటి ప్రచారం కోసం లక్షలు కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేయడం ఆనక వాటిని మూలపడేసి మరో కొత్త పధకం అందుకోవడం, మళ్ళీ దాని ప్రచారం ఇదంతా ఒక సైకిల్ చక్రంలా నిరంతరం సాగిపోతూనే ఉంది. కానీ వాటిలో ఏ కొన్ని పధకాలు మాత్రమే విజయవంతంగా అమలు చేయబడుతున్నాయి. అలాగా విజయవంతమయిన పధకాలు తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా యధాతధంగా అమలుచేయక తప్పని సరి పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూపాయికే కిలో బియ్యం, తెదేపా పరిచయం చేసిన రైతు బజారులు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పధకం, 108 అంబులెన్స్ సేవలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటివన్నీ వాళ్ళకి ప్రజలలో మంచి పేరు, ప్రతిష్టలు కల్పించడమే కాకుండా నేటికీ అవ్వన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే విషయాన్నీ అధికారంలో ఉన్న పార్టీలు గ్రహించగలిగితే ప్రజలకు చేరువయ్యి మంచి పేరుప్రతిష్టలు, దానితోబాటే తమ అధికారం సుస్థిరం చేసుకోగలిగేవి.
తెలంగాణా ప్రభుత్వం ఇంతకు ముందు “మన ఊరు-మన ప్రణాళిక” అనే పధకం ప్రవేశపెట్టారు. దాని స్థానంలో ఇప్పుడు మళ్ళీ ‘గ్రామజ్యోతి’ పధకం ప్రవేశపెడుతున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ చేసి గ్రామపంచాయితీలకు సాధికారత కల్పించడం ద్వారా గ్రామాలలో కూడా వేగంగా అభివృద్ధి సాధించడమే గ్రామజ్యోతి లక్ష్యం. అందుకోసం ప్రతీ గ్రామ పంచాయితీలో విద్య, వ్యవసాయం, మౌలికసదుపాయాల కల్పన, పారిశుద్యం-త్రాగునీరు, ఆరోగ్యం-పౌష్టికాహారం,సహజవనరుల నిర్వహణ, సామాజిక భద్రత-పేదరిక నిర్మూలన అనే ఏడు ప్రధాన అంశాల కోసం ప్రత్యేకంగా ఏడు కమిటీలు ఏర్పాటు చేయబడుతాయి. అవి తరచూ గ్రామ సభలు నిర్వహించి, ఆయా సమస్యల పరిష్కారానికి చేప్పట్టవలసిన చర్యలు, వాటికి అవసరమయిన ప్రణాళికలను తయారుచేసి పంచాయితీ రాజ్ శాఖకు పంపితే, వాటిని మంత్రి కె.తారక రామారావు పరిశీలించి నిధులు విడుదల చేస్తుంటారు. మరే ఇతర మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఎంపీల పెత్తనం లేకుండా నేరుగా గ్రామ పంచాయితీలలో ఏర్పాటు చేయబడిన ఆ ఏడు కమిటీలే ఆ నిధులతో గ్రామాభివృద్ధి పనులను చేపడతాయి. ఇదీ సంక్షిప్తంగా గ్రామజ్యోతి పధకం అమలుచేసే విధానం.
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, అప్పుడే దేశం కూడా సుభిక్షంగా ఉంటుందని మహాత్మా గాంధీజీ ఎప్పుడో చెప్పారు. కానీ ఇంతవరకు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన నేతలెవరూ ఆయన చెప్పిన ఆ మంచి మాటని చెవికెక్కించుకోకుండా నగరాలు, పట్టణాలనే అభివృద్ధి చేసుకొంటూ గ్రామాలను తీవ్ర నిర్లక్ష్యం చేసాయి. అందుకే స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ గ్రామాలు అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నాయి. తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు మొదలుపెట్టబోతున్న గ్రామజ్యోతి పధకాన్ని చిత్తశుద్ధితో అమలుచేసినట్లయితే వచ్చే నాలుగేళ్ళలో తెలంగాణా రాష్ట్ర ముఖ చిత్రం పూర్తిగా మారిపోవడం తధ్యం.
కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ వారసుడికి ప్రభుత్వంలో అన్ని మంత్రిత్వ శాఖలపై అదుపు, పట్టు కల్పించేందుకే ఈ గ్రామజ్యోతి పేరిట కేటీఆర్ కి అధికారాలు కట్టబెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది గ్రామజ్యోతి కాదని కేసీఆర్ ‘కుటుంబ జ్యోతి’ అని వారు విమర్శిస్తున్నారు. వారి విమర్శలు, కేసీఆర్ ఉద్దేశ్యాలు ఎలాగా ఉన్నప్పటికీ, ఈ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని కేటీఆర్ సమర్ధంగా నిర్వహించి చూపగలిగితే తెలంగాణాలో వేలాది గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. దానితో బాటే ఆయనకి, పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలలో మంచి పేరు కూడా వస్తుంది. ఏదో విధంగా గ్రామాలలో సమస్యలు తీరడమే కదా ఎవరికయినా కావలసింది. ఆపని మంత్రి కే.టీ.ఆర్. చేసినా, హరీష్ రావు ఎవరు చేసినా ప్రతిపక్షాలకే తప్ప ప్రజలకేమీ అభ్యంతరం ఉండదు.