గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ చాలా అత్యుత్సాహంగా స్పందిస్తోంది. ఆమె రాజీనామాపై రాహుల్ గాంధీ స్పందిస్తూ “13ఏళ్ల మోడీ పాలన కారణంగానే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి తప్ప ఆనందీ బెన్ పటేల్ రెండేళ్ళ పాలన వలన కాదు. భాజపా ఆమెని బలిపశువుగా చేసింది. కానీ అది ఆ పార్టీని కాపాడలేదు,” అని ట్విట్ చేశారు.
గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ మరియు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గురుదాస్ కామత్ పూర్తి భిన్నంగా స్పందించడం విశేషం. “రాష్ట్రంలో పటేల్ కులస్తులు, దళితులలో భాజపా ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అది నానాటికీ పెరిగిపోతోందే తప్ప తగ్గడం లేదు. అందుకే భాజపా ఆమె చేత రాజీనామా చేయించి ఆమెని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఆమెని ముఖ్యమంత్రి పదవిలో నుంచి తప్పించి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించినా దళితుల అవమానపరిచినట్లే అవుతుంది,” అని అన్నారు.
1995లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ని చేజార్చుకొంది. అప్పటి నుంచి భాజపా చేతుల్లో ఉన్న దానిని తిరిగి దక్కించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గోద్రా అల్లర్ల తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోలేకపోయింది. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏకధాటిగా 13ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించారు. ఒకవేళ జాతీయ రాజకీయాలకి రాకపోయుంటే మరో 20 ఏళ్ళు పాలించి ఉండేవారేమో. ఆయన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆనందీబెన్ పటేల్ రెండేళ్ళ పాలనలో గుజరాత్ లో పటేల్ ఉద్యమం, ఇటీవల మొదలైన దళితుల ఉద్యమం మొదలైంది. చిరకాలంగా ఇటువంటి అవకాశం కోసమే ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆనందీ బెన్ రాజీనామాని వాటితో ముడిపెట్టి గుజరాత్ లో అల్లుకుపోవాలని తాపత్రయపడుతోంది.
మోడీ పాపాలకి ఆనందీ బెన్ ని బలి చేశారని రాహుల్ గాంధీ చెపుతుంటే, రెండేళ్ళ పాలనలో రాష్ట్రంలో రెండు వర్గాలలో పెరిగిన అసంతృప్తి పెరిగినందునే భాజపా ఆమెని కాపాడే ప్రయత్నం చేస్తోందని గురుదాస్ కామత్ చెప్పడం విశేషం. వారి భిన్నమైన స్పందనలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఆమె ఎందుకు రాజీనామా చేశారనే దానిపై స్పష్టత లేదని స్పష్టం అవుతోంది.
ఆమె రెండేళ్ళ పాలనలో ప్రజలలో అసంతృప్తి పెరుగుతున్నట్లు గుర్తించిన భాజపా అధిష్టానం, ఆమె కారణంగా వచ్చే ఏడాది జరుగబోయే శాసనసభ ఎన్నికలలో అధికారం చేజార్చుకోకూడదననే ముందుచూపుతోనే ఆమె చేత రాజీనామా చేయించి ఆమె స్థానంలో సమర్ధుడైన ముఖ్యమంత్రిని నియమించుకోవాలనుకొంటోంది. అది చాలా సహజమే. కానీ ఆమె రాజీనామా అంశాన్ని కూడా రాజకీయం చేయాలనే తాపత్రయంలో రాహుల్ గాంధీ ఒకలాగ, గురుదాస్ కామత్ మరొకలాగ బాష్యం చెపుతున్నారు.