తెలుగులో ప్రముఖ పత్రికలు మీడియా సంస్థలు పోషిస్తున్న పరోక్ష రాజకీయ పాత్ర ఇప్పుడు మామూలు పాఠకులకు కూడా అర్థమయ్యేంత ప్రత్యక్ష రూపం తీసుకున్నది. 360లో చాలా సార్లు అలాటి విశేషాలపై నేను వ్యాఖ్యానించాను. నమస్తే తెలంగాణ పత్రిక నేపథ్యం భిన్నమైంది గనక దానికా సమస్య లేదు. కర్త కర్మ క్రియ టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్న వాస్తవాన్ని వారెప్పుడూ దాచుకున్నది లేదు. అయితే ఆ విధంగా సరిపెట్టుకున్నా సమర్థించుకోలేని స్థితిలో ఇటీవల సర్కారు కోణం సర్వస్వమై పోతున్నది. ఉదాహరణకు మల్లన్నసాగర్ లాఠీచార్జి, గాలిలోకి కాల్పుల వార్త ఆ పత్రిక 25వ తేదీన మొదటి పేజీలో ఇవ్వనేలేదు.లోపల కూడా రెచ్చగొట్టడం రాళ్లు రువ్వడం వంటి శీర్షికతో ఇచ్చింది. అది వారి ఇష్టం అనొచ్చు గాని కారణం ఏదైనా బాదితులు తెలంగాణ ప్రజలే కదా? ఆ తర్వాత ప్రతిపక్షాలపై వరుస కథనాలు వచ్చాయి గాని ప్రజల కోణం లేదా వాదన ఒక్కటంటే ఒక్కదానికైనా సముచిత స్థానం కల్పించలేదు. ఆ తర్వాత వరసగా ప్రతిపక్షాలపై దాడులతో వ్యాస పరంపర. సిపిఎంపై ప్రత్యేకంగా దాడి కేంద్రీకరణ. ఈ క్రమంలో గతంలోని వాస్తవాలను కూడా మర్చిపోయి ఆరోపణలు. ఉదాహరణకు ముదిగొండ పోలీసు కాల్పులు ఒక కుట్ర ఫలితమని కొండంత అభాండం. ఆ రోజుల్లో కెసిఆర్ అందరికన్నా ముందు అక్కడికి వెళ్లి జోహారులర్పించిన సంగతి మర్చిపోయిన ఫలితమిది. ఇక తర్వాత అధికార భాషా సంఘం అద్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావు ప్రతిపక్షాలు వెంటిలేటర్‌పై వున్నాయంటూ రాజకీయ వేత్తలను మించిపోయి రాసిన వ్యాసం(కాలమ్ పేరు మాత్రం ముక్తసరి) ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా లెఫ్ట్న కమ్యూనిస్టులపైన రైట్న బిజెపిపైన ఏకబిగిన దాడి చేసే ఆ వ్యాసం రాజ్యాంగ పదవిలో వున్న ఒక సాహితీ వేత్త రాయవసలిందేనా అని ఒక సందేహం కలుగుతుంది.
ఈ పరిశీలనకు కొస మెరుపు పద్మవ్యూహం ఛేదించడమెలా అని హైదరాబాదు నగర సమస్యలపై సంపాదకుడు కట్టాశేఖర్‌రెడ్డి కట్టామీఠా. నిజానికి ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత రోడ్ల పరిస్థితి వంటివి మరింత దిగజారాయనే భావన పెరుగుతున్నది. మంత్రి కెటిఆర్ ప్రత్యక్ష బాధ్యత తీసుకున్నాక కొంత మెరుగుపడుతుందని ఆశించినవారికి కూడా నిరాశతప్పలేదు. ఇటీవల ఈనాడు సిటీలోనూ పూర్తిపేజీ రోడ్ల దుస్థితిపై వ్యాఖ్య సహితంగా కథనం రావడంతో రాయకతప్పని స్థితి ఎలా ఏర్పడిందొ అందరికీ అర్థమైంది. ఇంత జరిగాక రాసిన సంపాదక వ్యాఖ్య కట్టామీఠా పాలకులకు మీఠా, అధికారులకు గత పాలకులకు కట్టా అన్న తరహాలో నడిచింది. కెటిఆర్‌పై నమ్మకం వుందట కాని అంతా అధికారుల అలసత్వం అభ్యంతరాలు పెట్టే స్థలయజమానుల వైఖరి,సాంకేతిక సమస్యల వల్లనే ఇబ్బందులట. ”క్షేత్రంలో పనిచేసే అధికారులు నిజాయితీ పరులూ మంచివాళ్లూ కావాలి” అంటారు. కెటిఆర్‌ను పొగడొచ్చు గాని అధికారులందరినీ అవహేళన చేయడం అవసరమా అద్యక్షా? పొగడ్తలు తప్పు లేదు గాని శ్రుతిమించితే విశ్వసనీయతకే విఘాతం. విజయాలకే కాదు , వైఫల్యాలకు కూడా నేతలకు బాధ్యత వుంటుందని గుర్తించాలి మరి!