ఉత్తరప్రదేశ్ పిసిసి అధ్యక్షుడుగా నియమింపబడిన రాజ్ బబ్బర్ నెల రోజులలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చక్కగా అంచనా వేసి దాని భవిష్యత్ ఏవిధంగా ఉంటుందో టూకీగా రెండు ముక్కలలో చెప్పేశారు. “ఊహించని అద్భుతమేదో జరిగితే తప్ప వచ్చే ఏడాది జరుగబోయే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కలేదని” తేల్చి చెప్పేశారు. పిసిసి అధ్యక్షుడుగా ఉంటూ పార్టీ శ్రేణులని నిరాశపరచడం ఎందుకనుకొన్నారో ఏమో “ఆ అద్భుతం నేడు సోనియా గాంధీ వారణాసి పర్యటనతో జరుగుతుందని” సర్ది చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి యూపి పుట్టిల్లు వంటిది. డిశంబర్ 1989న ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం అయ్యింది. మళ్ళీ ఇంతవరకు దానికి అధికారం అందని ద్రాక్షపళ్ళలాగే ఊరిస్తోంది. ఇన్నేళ్ళు ప్రతిపక్ష బెంచీలకే పరిమితం అయిన కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అసలు ఇన్నేళ్ళు పార్టీ మనుగడ సాగించడమే చాలా గొప్ప విషయం.
జీవచ్చవం వంటి ఆ కాంగ్రెస్ పార్టీకి రాజ్ బబ్బర్, ముఖ్యమంత్రి అభ్యర్ధి షీలా దీక్షిత్ ప్రాణం పోసి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాని, నేటికీ చాలా బలంగా ఉన్న ప్రతిపక్ష బి.ఎస్.పి.ని ఎదుర్కొని గెలవవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అది చాలా అసాధ్యమని రాజ్ బబ్బర్ చాలా తొందరగానే పసిగట్టారు. ఆయన కంటే ముందు కాంగ్రెస్ అధిష్టానం పసిగట్టిందని చెప్పవచ్చు. అందుకే రాహుల్ గాంధీకి ఆ మచ్చ అంటకూడదనే ముందు జాగ్రత్తతో ప్రియాంకా వాద్రాకి ప్రచార బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. కనుక రాహుల్ గాంధీని పక్కనబెట్టి ఆమెకి ప్రచార బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ అనుకొన్నపుడే ఆ పార్టీ ఓటమిని అంగీకరించినట్లు చెప్పవచ్చు. రాజ్ బబ్బర్ కూడా అదే చెప్పారు.