కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి వైరల్ ఫీవర్ వచ్చింది. అదేమీ పెద్ద విశేషం కాదు. వారణాసిలో ఆమె నిన్న ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కొద్దిసేపటికే వైరల్ ఫీవర్ కారణంగా చాలా నీరసపడిపోవడంతో అర్దాంతరంగా తన పర్యటనని ముగించుకొని డిల్లీకి తిరిగి వచ్చేశారు. అది కూడా పెద్ద విశేషమేమీ కాదు. ఆమెకి జ్వరం వచ్చిందని తెలియగానే ప్రధాని నరేంద్ర మోడీ చేసిన హడావుడే అసలైన విశేషం.
ఆ సంగతి తెలుసుకోగానే ఆయన యధాప్రకారం, “ఆమె త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నానని” ట్విట్టర్ లో మెసేజ్ పెట్టేశారు. ఆ తరువాత, కాంగ్రెస్ యూపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో దిగుతున్న షీలా దీక్షిత్ కి ఫోన్ చేసి ఆమె ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు. అంతటితో ఆగలేదు. వెంటనే డిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానం, వైద్యుడిని వారణాసికి పంపించారు. వారణాసి విమానాశ్రయంలోనే సోనియా గాంధీకి అత్యవసర వైద్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించారు. ఆ తరువాత ఆమె మోడీ పంపిన ప్రత్యేక విమానంలో డిల్లీ చేరుకొన్నారు.
సోనియా గాంధీకి జ్వరం వస్తే మోడీ ఇంత హడావుడి చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఆమె ఏ సహారా ఎడారిలోనో, దండకారణ్యంలోనో చిక్కుకుపోలేదు. అన్నివిధాల అభివృద్ధి చెందిన వారణాసిలో ఉన్నారు. అక్కడ ఆమెకి ఎటువంటి ఆరోగ్య సమస్య ఎదురైనా అవసరమైన అన్ని వైద్యసేవలు తక్షణమే లభిస్తాయి. పైగా ఆమె చుట్టూ అతిరధ మహారధుల వంటి అనేకమంది కాంగ్రెస్ నేతలున్నారు. వారు ఆమెకి సహాయపడగలరు. అవసరమైతే వారే ప్రత్యేక విమానంలో డిల్లీకి, ఇంకా అవసరమైతే విదేశాలకి కూడా పంపగల సమర్ధులు.
మరి అటువంటప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఇంత హడావుడి చేయడం అవసరమా? అంటే అవసరమే అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇవ్వాళ్ళ రాజ్యసభలో కేంద్రప్రభుత్వం మళ్ళీ జి.ఎస్.టి.బిల్లు ప్రవేశపెట్టబోతోంది. అది ఆమోదం పొందాలంటే కాంగ్రెస్ సహకారం చాలా అవసరం. బహుశః అందుకే ఈ హడావుడి చేశారేమో?
దేశంలో ప్రధాన నగరాల మొదలుకొని మారుమూల గ్రామాల వరకు అనేక కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు, నిరుపేదలు, ముఖ్యంగా పసిపిల్లలు కిడ్నీ, గుండె తదితర తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కానీ వైద్యచికిత్స చేయించుకోవడానికి డబ్బులేక దాతల సహాయం కోసం అర్ధించడం నిత్యం పేపర్లలో చూస్తూనే ఉన్నాము. అటువంటి వారి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎంత చేసినా అందరూ మెచ్చుకొంటారు. కానీ ఈ విధంగా హడావుడి చేయడాన్ని ఎవరూ హర్షించ(లే)రు.