ప్రస్తుతం ఏపిలో ప్రత్యేక హోదా కోసం మళ్ళీ మొదలైన హడావుడి కారణంగా రాష్ట్రంలో భాజపా నేతలు ఎవరూ మీడియాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఆ విషయంలో అటు కేంద్రాన్ని ఒప్పించలేక, ఇటు ప్రజలకి సర్దిచెప్పలేక వారు కూడా చాలా ఇబ్బందిపడుతున్నారని చెప్పడానికి వారి మౌనమే సాక్ష్యం. ఈ విషయంలో వారి తప్పేమీ లేకపోయినా వారు ప్రజల ముందు దోషులుగా నిలబడవలసి వస్తోంది. అయినప్పటికీ కొంచెం ధైర్యం ఉన్న ఎనిమిరెడ్డి మాలకొండయ్య వంటి కొందరు నేతలు, ఇటువంటి సమయంలో కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లా భాజపా అధ్యక్షుడు మాలకొండయ్య నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ సహాయం చేయలేదన్నట్లు ప్రతిపక్షాలు ధర్నాలు, బంద్ లు నిర్వహిస్తూ విమర్శలు గుప్పిస్తుంటే, మిత్రపక్షంగా ఉన్న తెదేపా వారికి ధీటుగా సమాధానం చెప్పకుండా అది కూడా వారితో కలిసి కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం చాలా శోచనీయం. ఈ రెండేళ్ళలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సుమారు రూ.2లక్షల కోట్లు వరకు వివిద పద్ధుల క్రింద నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులకి సహాయసహకారాలు అందిస్తోంది. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రోడ్డున పడేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతే, కేంద్రప్రభుత్వమే రాష్ట్రాన్ని ఆదుకొని మళ్ళీ గాడిన పడేందుకు సహకరిస్తోంది. ఇప్పుడు కేంద్రాన్ని విమర్శిస్తున్న పార్టీలు అన్నీ రాష్ట్ర విభజన సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేదేకాదు.”
“రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు తమ మనుగడ కోసమే ఈవిధంగా బూటకపు పోరాటాలు సాగిస్తున్నాయి. వాటికి తెదేపా కూడా వత్తాసు పలకడం చాలా దురద్రుష్టకరం. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ల మద్దతు కారణంగానే రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రాగలిగిందనే విషయం మరిచిపోయి ఇప్పుడు ప్రధానినే తెదేపా నేతలు విమర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఉన్న సాంకేతిక అవరోధాలు, ఇతర ఇబ్బందుల గురించి తెదేపాకి తెలిసి ఉన్నప్పటికీ అది కూడా ప్రతిపక్ష పార్టీలతో కలిసి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం చాలా దురద్రుష్టకరం. కనుక ఇప్పటికైనా తెదేపా తన తీరు మార్చుకొంటే అందరికీ మంచిది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుంది,” అని మాలకొండయ్య అన్నారు.
మీడియా ద్వారా తెదేపాని, ప్రతిపక్ష పార్టీలకీ ఈవిధంగా ధీటుగా జవాబులు చెప్పవచ్చు కానీ ఇటువంటి మాటలతో ప్రజలని మెప్పించడమే చాలా కష్టం. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి చాలా సహాయమే చేసి ఉండవచ్చు. కానీ ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం అనే మూడు హామీల అమలుచేయకుండా డొంకతిరుగుడు సమాధానాలు చెపుతోందనే సంగతి ప్రజలకి తెదేపాయో లేదా ప్రతిపక్ష పార్టీలో చెపితే గానీ అర్ధం చేసుకోలేరని భాజపా భావిస్తే అంతకంటే అవివేకం లేదు. ఆ మూడు హామీల అమలు విషయంలో వారు ప్రజలకి సూటిగా, నిర్దిష్టంగా జవాబులు చెప్పుకోగలిగితే, ఈవిధంగా తెదేపానో ప్రతిపక్షాలనో తిట్టుకోవలసిన అవసరమే ఉండదు. కానీ వారి వద్ద సమాధానాలు లేవు కనుక ఎప్పటికీ ఈ బాధ కూడా భరించకతప్పదు.