సరిహద్దులో ‘కాల్పుల విరమణ’ను పాకిస్ధాన్ మళ్ళీ ఉల్లంఘించింది. వారంలో రెండోసారి బాలాకోట్ సెక్టార్ లో ఆదేశపు సైన్యం జరిపిన కాల్పుల్లో మొత్తం 6గురు భారతీయులు మరణించారు. 15 మంది గాయపడ్డారు. భూభాగాన్ని ఆక్రమించుకునే ‘పాతయుద్ధం’ పాకిస్ధాన్ ఉద్దేశ్యం కాకపోవచ్చు.
ఆర్ధిక శక్తిగా ఎదుగుతున్న భారత్ కు కాళ్ళు అడ్డం పెట్టడమే పాక్ విధానం ‘జీహాదీ’లను మనదేశంలోకి పంపి కల్లోలం సృష్టించడమే ఇందుకు వారి వ్యూహం. సరిహద్దుల్లో అలజడిని రేకెత్తించి ప్రజల ఉద్వేగాలను మళ్ళించడమే ఇందుకు వారి మార్గమని ఈ వ్యవహారాలను గమనిస్తున్న ఎవరికైనా అర్ధమౌతుంది.
కాశ్మీర్ ని సంపూర్ణంగా విముక్తి చేస్తేనే పాకిస్ధాన్ ఆవిర్భావమైనట్టు అనే పాకిస్ధాన్ నాయకుల సైనికాధికారుల భావతీవ్రత1950 ల్లో వున్నంతగా తరువాతకాలంలో లేదు. కాశ్మీర్ సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పాక్ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషా్రఫ్ 2002 లో ప్రకటించడం ఉద్రిక్తతలు సడలడంలో అతిపెద్దమలుపు.
దేశరక్షణ, భధ్రతల దృష్ట్యా విదేశీవ్యవహారాల్నీ గోప్యంగా వుండిపోతాయి. ఆవ్యవహారాలు విశ్లేషించే జర్నలిస్టుల కధనాల ప్రకారం రెండు దేశాలు 4 అంశాలపై అంగీకారానికి వచ్చాయి. వాస్తవ ఆధీనరేఖనే ఇరుదేశాల సరిహద్దుగా గుర్తించాలని, సరిహద్దులో స్వేచ్ఛగా రాకపోకలకు అనుమతించాలని, జమ్మూకాశ్మీర్లోని ఇరువైపుల భూభాగాలకు మరింత ఎక్కువ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని, క్రమంగా సరిహద్దుల్లో సైన్యాల మోహరింపు తగ్గించుకోవాలని అవగాహనకు వచ్చారు. ఇదంతా సంవత్సరాల తరబడి చేసిన కృషి ఫలితం. ఇదంతా భారత ప్రధానులు వాజ్ పాయ్, మన్మోహన్ సింగ్ ల సాగించి సాధించిన దౌత్యనీతి విశేషం.
ఇదంతా భారత్ వైపు దృశ్యమే. పాకిస్ధాన్ లో సీన్ మరోలా వుంది. అక్కడ ప్రజలెన్నికున్న ప్రభుత్వం మీద పెత్తనం చేసేది సైనికాధికారులు. భారత్ తో సంబంధాల వరకూ సైన్యం జీహాదీల వైపు వుంది. పాక్ ప్రభుత్వం ఆర్ధిక సంస్కరణలవైపు వుంది. ఒకదశలో సైన్యాధికారి పర్వేజ్ ముషా్రఫ్ తో ”మీ తీవ్రవాదాన్ని ఆపకపోతే మనకి అభివృద్ది వుండదు, పెట్టుబడులు రావు ” అని పాక్ ఇంటర్నల్ సెక్యూరిటీ మంత్రి మొహిద్దీన్ హైదర్ చెప్పగలిగే వరకూ పరిస్ధితి మారింది.
అమెరికాలో ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ మీద జీహాదీల దాడి తరువాత పాకిస్ధాన్ వైఖరిలో మార్పు వచ్చింది. పౌరప్రభుత్వం సలహాలు సైనికాధికారుల ముందు విలువలేకుండా పోయాయి. చిక్కుముడి విడిపోవచ్చనుకుంటున్న కాశ్మీర్ మళ్ళీ పీటముడిగా బిగుసుకుపోయింది. పాక్ సైనికాధికారులు దేశంలో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టడానికి నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పటి గోద్రా సంఘటనను వాడుకుంటున్నారు. దేశదేశాల్లో భారత్ సంబంధాలను విస్తరింపజేస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి పొరుగు దేశమైన పాకిస్ధాన్ తో సంబంధాలను మాత్రం మొదటినుంచీ మళ్ళీ నిర్మించుకోవలసిన పరిస్ధితి కనబడుతోంది.
మోదీ, పాక్ ప్రధాని షరీఫ్ లు అనూహ్యంగా కొద్దిరోజులక్రితమే రష్యాలో సమావేశమయ్యారు. రెండుదేశాల మధ్య చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని అవగాహనదు వచ్చారు. సరిహద్దుల్లో పాక్ వల్ల ఉద్రిక్తతలు సాగుతున్నసమయంలో ఈచర్చల వల్ల మోదీకి ప్రచారమే తప్ప దేశానికి ప్రయోజనంలేదని కాంగ్రెస్ విమర్శింంచింది. పాక్ మినహా దక్షిణ ఆసియాదేశాల్లో భారత్ పెద్దరికానికి, గౌరవ మర్యాదలకు లోటులేదు. అటువంటి స్ధానాన్నే మధ్య ఆసియా దేశాలనుంచి పొందడంలో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న నరేంద్రమోదీ పాకిస్ధాన్ వ్యవహారాలను ”అటునుంచి నరుక్కొస్తున్నారు” అనుకోవచ్చు.
ప్రజలెన్నుకున్న భారత ప్రభుత్వానికీ పౌరసమాజాన్ని నడిపించే పాక్ సైనిక ప్రభావానికీ మధ్యలో ప్రజా, సైనిక దృక్పధాల్లో వుండే తేడాయే రెండుదేశాలమధ్యా సామరస్య సాధనకు ముఖ్యమైన అవరోధంగా కనిపిస్తోంది.