మెగా ఫ్యామిలీ నుంచి ఓ హీరో వస్తున్నాడంటే అంచనాల పర్వం మొదలైపోతుంది. డాన్సులు బాగా చేస్తాడా, ఫైటింగులు ఎలా ఉంటాయి? డైలాగ్ డెలివరీ ఎలా ఉండబోతోంది? స్టైల్ చూపిస్తాడా? ఇలా రకరకాల ప్రశ్నలు. మెగా హీరో అయితే వీటన్నింటికీ సమాధానాలు చెప్పాల్సిందే. అభిమానుల్ని శాటిస్పై చేయాల్సిందే. అలాంటి అంచనాల భారాన్ని మోయకుండా తెలివిగా తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నాడు అల్లు శిరీష్. గౌరవం లాంటి సబ్జెక్ట్ ఎంచుకొన్నప్పుడే శిరీష్ తెలివి తేటలు బయటపడిపోయాయి. ఆ సినిమా ఫ్లాప్ కావొచ్చు. కానీ.. ‘నాకున్న పరిమితుల్లో సినిమా చేస్తా’ అని క్లియర్ కట్‌గా చెప్పడానికి ఆ సినిమా ఉపయోగపడింది. కొత్త జంటలో కాస్త మారాడు. ఆమార్పు… శ్రీరస్తు – శుభమస్తులో ఇంకాస్త ఎక్కువగా కనిపించబోతోంది అంటున్నాడు శిరీష్. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పుకొచ్చిన విశేషాలు ఇవీ…
* కొత్త జంట తరవాత గ్యాప్ బాగా తీసుకొన్నట్టున్నారు..
– అవునండీ.. ఆ టైమ్ లో నాకు మోచేయి గాయం వల్ల కొన్ని రోజులు షూటింగులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు మంచి కథల కోసం ఎక్కువ కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. కొత్త జంటతో ఓ వర్గానికి చేరువయ్యా. ఈసారి అందరికీ నచ్చే సినిమా చేయాలనిపించింది. అందుకే.. కాస్త లేటయినా మంచి కథని ఎంచుకోవాలనుకొన్నా. అదే సమయంలో పరశురామ్ ఈ కథ చెప్పారు. వినగానే చాలాబాగుందనిపించింది. పరశురామ్ ఇంకాస్త టైమ్ తీసుకొని పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తయారు చేశారు.
* కొత్త జంటకూ.. శ్రీరస్తు – శుభమస్తుకూ మీలో కనిపించిన మార్పులేంటి?
– నటుడిగా చాలా మార్పు కనిపించింది. డిక్షన్ మారింది… లుక్ మారింది. ఎక్స్ప్రెషన్స్ మారాయి. ప్రతీ యాంగిల్లోనూ ఆ ఛేంజ్ ఓవర్ కనిపించింది.
* దానికి కారణం ఏంటంటారు..?
– నా చుట్టూ ఉన్న నటులే కావొచ్చు. ఎందుకంటే సీరియర్ మోస్ట్ యాక్టర్స్‌తో కలసి పనిచేశా. సెట్లో వాళ్లంతా నటిస్తున్నట్టు ఉండేది కాదు. పాత్రలో అంతలా ఇన్వాల్వ్ అయిపోయేవారు. డీసెంట్ యాక్టర్‌కీ గ్రేట్ యాక్టర్‌కీ తేడా నాకు ఈ సినిమా సెట్లో కనిపించింది. డీసెంట్ యాక్టర్ తన పని తాను చేసుకొని వెళ్లిపోతాడు. గ్రేట్ యాక్టర్ మాత్రం.. తన చుట్టూ ఉన్నవాళ్లపై కూడా ప్రభావం చూపిస్తాడు. నాలో మార్పుకి అదీ ఓ కారణం కావొచ్చు.
* పరశురామ్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది?
– ఆయనలాంటి దర్శకుడితో పనిచేయడం అదృష్టం అనుకోవాలి. కథని బాగా నేరేట్ చేస్తారాయన. డైలాగులూ బాగుంటాయి. నాలో కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చారు. నాతో సినిమాలు చేయాలనుకొన్న దర్శకులకు శిరీష్ ఏం చేయగలడో ఈ సినిమాలో చూపించారు.
* ఈ సినిమాని చిరంజీవిగారు బొమ్మరిల్లుతో పోలుస్తున్నారు..
– మావయ్యకి అలా ఎందుక అనిపించిందో నాకు తెలీదండీ. నిజంగానే బొమ్మరిల్లూకీ ఈ సినిమాకీ సంబంధం లేదు. బహుశా. అందులో ఉన్న ఎమోషన్ ఈ సినిమాలోనూ ఆయనకు కనిపించి ఉండొచ్చు. కథ పరంగా, పాత్రల పరంగా.. ఈ రెండు సినిమాలకూ ఎలాంటి పోలిక లేదు.
* మీ సొంత సంస్థలో తీసిన సినిమా కదా.. బాగా ఖర్చు పెట్టించారా?
– అదేం లేదండీ. ఈ కథకు ఎంత పెట్టాలో అంతే పెట్టారు. ఓవర్ బడ్జెట్ అనేది నాన్నగారికి నచ్చని విషయం. కొడుకు సినిమా కదా అని ఎక్కువగా పెట్టరు.
* శిరీష్ నిర్మాత అవుతాడేమో అనుకొన్నా… అన్నారు చిరంజీవి గారు. మీకు ఆ ఉద్దేశం ఉండేదా?
– నిజానికి నాకు ఆర్థిక లావాదేవీలను పట్టించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. నాకు ముందు నుంచీ నటుడ్ని కావాలనే కోరిక. అయితే నాకంటూ కొన్ని పరిమితులున్నాయి. వాటిని దృష్టి లో ఉంచుకొనే కథల్ని ఎంచుకొంటున్నా.
మా కుటుంబంలో అందరూ మాస్ హీరోలే. నేనూ అలాంటి కథలనే ఎంచుకొంటే నాకంటూ ప్రత్యేకత ఉండదు. అందుకే ఇలాంటి సున్నితమైన కథలనే ఎంచుకొంటున్నా..
* మెగా హీరోలంటే డాన్సులు బాగా చేయాల్సిందే కదా…?
– ఆ తరహా అంచనాలుంటాయని నాకు తెలుసు. నేనేం అన్నయ్యలానో, చరణ్‌లానే డాన్సర్‌ని కాదు.. ఏదో నాకొచ్చింది ట్రై చేస్తుంటా.
* మీ బలం ఏంటి?
– ఈ సినిమా చేశాక… కామెడీ బాగా పండించగలను అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో నేనూ నా వంతుగా నవ్విస్తుంటా. కామెడీ టైమింగ్ పట్టుకోవడం చాలా కష్టం అంటుంటారు. నాకెందుకో అది త్వరగా అబ్బేసిందని నా నమ్మకం.
* మీ తదుపరి సినిమా పిరియాడికల్ నేపథ్యంలో అంట కదా…?
– అవునండీ. కాకపోతే మగధీరలా భారీ సెటప్పులు ఉండవు. చాలా సింపుల్ కథ అది. పాటలు, డాన్సులు అన్నీ ఉంటాయి. కథేంటన్నది తెరపై చూడాల్సిందే,