ఇస్లామాబాద్ లో ఇవ్వాళ్ళ, రేపు జరుగబోయే సార్క్ సమావేశాలలో హాజరయ్యేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈరోజు పాకిస్తాన్ బయలుదేరి వెళుతున్నారు. ఆయనని పాకిస్తాన్ లోకి అనుమతిస్తే ఊరుకోబోమని, ఆయనకి స్వాగతం పలికి మర్యాదలు చేస్తే పాక్ ప్రభుత్వానికి కూడా గట్టిగా బుద్ధి చెపుతామని హిజ్బుల్ ముజాహిద్దీన్ అధినేత హఫీజ్ సయీద్ హెచ్చరించారు. రాజ్ నాథ్ సింగ్ ఇస్లామాబాద్ లో అడుగుపెట్టకుండా అడ్డుకొంటామని కూడా హెచ్చరించారు. హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ నేతృత్వంలో మరికొన్ని ఉగ్రవాద సంస్థలు వేలాదిమందితో కలిసి ఇస్లామాబాద్ లోని భారత ఎంబసిని ముట్టడించేందుకు ఇప్పటికే ఒక ర్యాలీగా బయలుదేరాయి. నేడు అవి ఇస్లామాబాద్ చేరుకొంటాయి.
ఉగ్రవాద సంస్థల ఈ ర్యాలీలు, ముట్టడి, హెచ్చరికల నేపధ్యంలో భారత్ కూడా పాక్ ప్రభుత్వాన్ని గట్టిగానే హెచ్చరించింది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎంబసీలో దౌత్యవేత్తల భద్రతకి పాక్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. పాక్ ప్రభుత్వం కాశ్మీరు అల్లర్ల విషయంలో ఇంతవరకు రాజ్ నాథ్ సింగ్ నే నిందిస్తోంది. ఇప్పుడు ఆయననే పాక్ ప్రభుత్వం రక్షణ కల్పించవలసి వస్తోంది. కాశ్మీరులో అది అత్యుత్సాహం ప్రదర్శించినందుకే భారత్ ఈవిధంగా చేసి ఉండవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. కనుక పాక్ ప్రభుత్వానికి ఇది పెద్ద అగ్నిపరీక్ష వంటిదేనని చెప్పవచ్చు. కానీ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మళ్ళీ క్షేమంగా భారత్ తిరిగి వచ్చే వరకు భారత్ కూడా టెన్షన్ తప్పదు.