బోల్డంత టాలెంట్ ఉన్నా యాటిట్యూడ్ వల్లే కనుమరుగైపోయినవాళ్లెంతో మంది ఉన్నారు. రాజశేఖర్‌కి అవకాశాలు రాకపోవడానికి కారణం కూడా ఆ ఎటిట్యూడే అంటుంటారు ఆయన గురించి తెలిసినవాళ్లు. అయినా సరే.. రాజశేఖర్ కోసం కథలు పుడుతూనే ఉంటాయి. ఆయన టాలెంట్ అలాంటిది. మరోవైపు రాజశేఖర్ కూడా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఏది పడితే అది చేయకుండా.. ఈసారి హిట్టు కొట్టే సినిమానే చేయాలని అని పంతం పట్టుకొని కూర్చున్నాడు. అందుకే ఈమధ్య ఎన్ని అవకాశాలు వచ్చినా ‘నో’ చెప్పాడు. అయితే ప్రవీణ్ సత్తార్… కథని మాత్రం అంగీకరించాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తోంది.
గుంటూర్ టాకీస్ తో తన కెరీర్లో తొలిసారి డబ్బులొచ్చిన సినిమా తీశాడు ప్రవీణ్ సత్తార్. ఇప్పుడు రాజశేఖర్ కోసం ఓ కథ రెడీ చేసుకొన్నాడు. ఇదో పోలీస్ స్టోరీ. అంకుశంలా ఇది కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుందని నమ్ముతున్నాడాయన.
ఈ సినిమా కోసం రాజశేఖర్ తన లుక్ సైతం మారుస్తున్నాడట. ఆల్రెడీ సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఆగస్టు చివరి వారంలో సినిమా ప్రారంభం అవుతుంది.. త్వరలోనే ఈసినిమాలోని ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు తెలుస్తాయి