కృష్ణా పుష్కరాలకి భారీగా నిధులు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రప్రభుత్వాన్ని కోరాయి. కానీ వాటి అభ్యర్ధనలని పట్టించుకోలేదు. ఇటువంటి వైఖరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీర్ణించుకోగలుగుతోంది కానీ తెలంగాణా ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. తెరాస ఎమ్మెల్యే వేముల వీరేశం అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “కృష్ణా పుష్కరాల కోసం రూ.601 కోట్లు కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రానికి లేఖ వ్రాశారు. కానీ కేంద్రం ఒక్క పైసా కూడా విదిలించలేదు. ఇక తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వమే వివిధ శాఖల నిధులలో నుంచి రూ.825 కోట్లు సమకూర్చుకొని ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రప్రభుత్వం తెలంగాణా పట్ల ఎప్పుడూ సవతి తల్లి ప్రేమే చూపిస్తోంది. ఏపికి నిధులు ఇవ్వడానికి పెద్దగా ఆలోచించదు కానీ తెలంగాణాకి చాలా ఆచితూచి ఇస్తుంటుంది,” అని విమర్శించారు.
ఆయనకి భాజపా అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు జవాబు చెపుతూ, “తెలంగాణా ప్రభుత్వానికి సరైన ప్లానింగ్ లేకపోవడం వలననే ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. దేనికైనా నిధులు కావాలనుకొంటే కోరేందుకు ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారమే తగినంత సమయం ఇచ్చి సహాయం ఆశిస్తే ఫలితం ఉంటుంది. కానీ చివరి నిమిషంలో వచ్చి నిధులు కావాలని అడిగి, సాంకేతిక కారణాల చేత కేంద్రం ఇవ్వలేకపోతే ఈవిధంగా నిందించడం సరికాదు. అయినా తెలంగాణా ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ తో దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా ఉందని కెసిఆర్ చెప్పుకొన్నప్పుడు రెండేళ్ళలోనే నిధుల కోసం వెతుకులాడుకొనే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? కెసిఆర్ మానస పుత్రిక అని చెప్పుకొంటున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి కూడా తెలంగాణా ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేసుకోలేకపోతుంది. ఆదాయవ్యయాలపై తెలంగాణా ప్రభుత్వానికి సరైన అవగాహన లేకపోవడం వలననే ఈ దుస్థితి తలెత్తింది. తెలంగాణా ప్రభుత్వం తన లోపాలకి, తప్పులకి కేంద్రప్రభుత్వాని నిందించడం తగదు,” అని అన్నారు.
ప్రతీ రాష్ట్రంలో రకరకాల కార్యక్రమాలు, పండుగలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. గోదావరి, కృష్ణా పుష్కరాలు కూడా అటువంటివే. వాటన్నిటికీ కేంద్రప్రభుత్వమే నిధులు మంజూరు చేయాలంటే అసాధ్యం. వాటికి కూడా నిధులు మంజూరు చేయడం మొదలుపెడితే, ఇంతవరకు లేని కార్యక్రమాలు, ఉత్సవాలు కూడా పుట్టుకొస్తాయి. అప్పుడు వాటికీ కేంద్రం నిధులు మంజూరు చేయవలసి వస్తుంది. అలా చేయడం మొదలుపెడితే ఇకదానికి అంతే ఉండదు.
ఏపి, తెలంగాణా ప్రభుత్వాలు గోదావరి, కృష్ణా పుష్కారాలు నిర్వహించుకోవాలంటే నిర్వహించుకోవచ్చు. కానీ అవి కూడా ఇటువంటి తాత్కాలిక కార్యక్రమాల గురించి అనవసరమైన ప్రచారం చేసి, వాటి నిర్వహణ కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేయడం తగదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృష్ణా పుష్కరాల కోసం కనీసం రూ. 1600 కోట్లు పైనే ఖర్చు పెడుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. పుష్కరాల గురించి అనవసరమైన ప్రచారం చేసి వాటికి హైప్ క్రియేట్ చేయడం ఎందుకు? లక్షల్లో జనాలు వస్తున్నారని భయపడుతూ వారికి సౌకర్యాలు కల్పించడానికి చేతిలో డబ్బులు లేవని కేంద్రప్రభుత్వాన్ని నిందించడం ఎందుకు? ఇటువంటి కార్యక్రమాల గురించి ప్రభుత్వాలు అత్యుత్సాహం, ప్రచారయావ తగ్గించుకొని ఉన్నంతలోనే ఏర్పాట్లు చేస్తే ఎవరి ముందు చేతులు జాపకుండానే నిర్వహించుకోవచ్చుకదా?