తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగలడం చూస్తే అదేమైనా మొట్టికాయల నోము నోచుకొందా? అనే అనుమానం కలుగుకమానదు. నాలుగైదు రోజుల క్రితమే తెలంగాణా యూనివర్సిటీలలో వీసీల నియామకం కోసం అది జారీ చేసిన ఉత్తర్వులని హైకోర్టు రద్దు చేసి మందలించింది కూడా. మళ్ళీ ఇవ్వాళ్ళ, తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెంబర్: 123,124 లని రద్దు చేసింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణ చేయడానికి తెలంగాణా ప్రభుత్వం ఆ రెండు జి.ఓ.లని జారీ చేసింది.
ప్రతిపక్షాల, నిర్వాసితుల అభ్యంతరాలని పట్టించుకోకుండా వాటి ప్రకారమే ఏడు గ్రామాలలో భూసేకణ కూడా చేసినట్లు సమాచారం. కానీ ఇప్పుడు హైకోర్టు ఆ జి.ఓ.లని కొట్టివేయడమే కాకుండా భూసేకరణ చట్టం-2013 ప్రకారమే భూసేకరణ చేయాలని ఆదేశించింది. ఇది తెలంగాణా ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ భూసేకరణ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించిన మంత్రి హరీష్ రావుకి గట్టి ఎదురుదెబ్బగానే భావించవచ్చు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు భూసేకరణ చట్టం-2013 లేదా జి.ఓ. నెంబర్: 123లలో ఏవిధంగా కోరుకొంటే ఆ ప్రకారమే భూసేకరణ చేస్తామని మంత్రి హరీష్ రావు పదేపదే చెప్పారు. కానీ ఏవిధంగా భూసేకరణ చేస్తున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేసిన ప్రతిపక్ష పార్టీల నేతలని అక్కడికి రాకుండా మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఏమి జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
జహీరాబాద్ కి చెందిన కొందరు వ్యవసాయ కూలీలు, ఈ భూసేకరణ వలన తమకి అన్యాయం జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై స్పందించిన హైకోర్టు ఈవిధంగా తీర్పు చెప్పడంతో కధ మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది.
తెలంగాణా ప్రభుత్వం మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకి దొరికిపోవడమే కాకుండా, ఇంతవరకు పడిన శ్రమ అంతా వృధా అయిపోయింది. పైగా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు హైకోర్టు చేత మొట్టికాయలు, జి.ఓ. కొట్టివేయబడినందుకు అవమానం, ప్రతిపక్ష పార్టీల విమర్శలు తప్పలేదు.