ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ భాజపాకి మిత్రపక్షమైన తెదేపా ఎంపిలు పార్లమెంటు లోపలా బయటా ఆందోళనలు చేయడంతో దిగి వచ్చిన కేంద్రప్రభుత్వం, హోదాకి బదులు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇచ్చేందుకు సిద్దం అయినట్లు మీడియాకి లీకులు ఇచ్చింది. ఆ విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చింది కూడా. ఆ తరువాతే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి మాట్లాడారు. అదే విషయం రాజ్యసభలో కూడా చెప్పారు. కనుకనే చంద్రబాబు నాయుడు నేడు డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీ తదితరులని కలువబోతున్నారు. అంటే వారు ఆర్ధిక ప్యాకేజి గురించి చర్చించబోతున్నారని స్పష్టం అవుతోంది.
ఇంత స్పష్టంగా విషయం అర్ధం అవుతున్నా, వైకాపా నేత బొత్స సత్యనారాయణ ఇంకా “చంద్రబాబుతో జైట్లీ ఏమి మాట్లాడారో..ఏమో! మొన్నటి వరకు పార్లమెంటులో చాలా హడావుడి చేసిన తెదేపా ఎంపిలు తమ సీట్లలో నుంచి కదలకుండా ఉండిపోవడానికీ దీనికీ ఏమైనా సంబంధం ఉందేమో” అంటూ అనుమానాలు వ్యక్తం చేయడం, వారిద్దరూ ఏమి మాట్లాడుకొన్నారో ఆ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
వారిద్దరూ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం గురించే మాట్లాడుకొన్నారు కనుక దానిని ప్రజలకి తెలపాలని బొత్స డిమాండ్ చేశారు. అది వినడానికి బాగానే ఉన్నా ప్రతీ విషయాన్నీ బహిరంగపరచడం మంచి పద్దతి కాదు. అయినా ఆర్ధిక ప్యాకేజి గురించే వారు మాట్లాడుకొన్నట్లు స్పష్టం అవుతున్నప్పుడు, ముఖ్యమంత్రిని బొత్స ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే ఆ విషయం ముఖ్యమంత్రి చెపితే, వైకాపా దానిపై రాద్దాంతం చేయాలనే ఉద్దేశ్యంతోనే అని భావించవచ్చు.
నేటికీ కేంద్రప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వననే చాలా స్పష్టంగా చెపుతోంది. కేవలం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ మాత్రమే ఇస్తానని చెపుతోంది. అందుకు ముఖ్యమంత్రి అంగీకరిస్తే, ఆయనే ప్రజలకి జవాబు చెప్పుకొంటారు. కనుక అదే జరిగితే వైకాపా ఏమి చేయదలచుకొందో నిర్ణయించుకొంటే మంచిది. “ప్రత్యేక హోదాయే కావాలి..మరి దేనికీ అంగీకరించము.. ప్రత్యేక హోదా సాధించే వరకు మా పోరాటం సాగుతుందని” జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ చెపుతున్నారు. కనుక వారు ఇకనైనా ఆ మాటకే ఖచ్చితంగా కట్టుబడి ఉంటే మంచిదే. ప్రత్యేక హోదా కోసం కేంద్రప్రభుత్వంతో వారు యుద్ధం చేయదలిస్తే రాష్ట్ర ప్రజలు అందరూ వారికి మద్దతు పలుకుతారు. కానీ ఆ పేరుతో రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు.