మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ కోసం తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీఓ: 123ని హైకోర్టు రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వాటికి ఇదివరకులాగ గట్టిగా బదులు చెప్పలేక రాష్ట్ర ప్రభుత్వం తలదించుకొని మౌనంగా భరించవలసి వస్తోంది. కేంద్రప్రభుత్వం భూసేకరణ కొరకే ప్రత్యేకంగా భూసేకరణ చట్టం-2013 చట్టాన్ని ఏర్పాటు చేసినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా మల్లన్నసాగర్ కోసం వేరేగా జీఓ: 123ని ఎందుకు జారీ చేసిందో తెలియదు. కానీ భూసేకరణ చట్టం-2013 చట్టం ఒకటి ఉందని తెలిసి ఉన్నప్పటికీ జీఓ: 123ని జారీ చేసింది కనుక అది స్వయంకృతాపరాధమేనని భావించకతప్పదు. అదేవిధంగా జీఓ: 123 ద్వారా భూసేకరణ చేయవద్దని ప్రతిపక్షాలు గట్టిగా హెచ్చరిస్తున్నప్పటికీ తెలంగాణా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్ళడం మరొక పొరపాటు. ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ మనుగడ కోసమే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని అనుకొన్నప్పటికీ, వాటి వాదనలని ప్రభుత్వం కొంచెం అయినా పట్టించుకొని ఉండి ఉంటే బహుశః నేడు ఇటువంటి అవమానకర పరిస్థితులు ఎదుర్కొనే అవసరం ఉండేది కాదేమో? కనుక ఇకనైనా ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగులు ముందుకు వేయడం మంచిది.
ఈ వ్యవహారం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాఠాలు నేర్చుకొంటే మంచిది. ఎందుకంటే మచిలీపట్నం పోర్టు, గన్నవరం విమానాశ్రయ విస్తరణ, భోగాపురంలో విమానాశ్రయం, ఐటి పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకి వేల ఎకరాలు భూసేకరణకి ప్రభుత్వం సిద్దం అవుతోంది. దానిని రాష్ట్రంలో ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో అమలుచేసిన ల్యాండ్ పూలింగ్ పద్దతిలోనే మచిలీపట్నంలో కూడా భూసేకరణ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. కనుక హైకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పును, ప్రతిపక్షాల ఆందోళనలని, వాటి అభ్యంతరాలని కూడా దృష్టిలో ఉంచుకొని అడుగు ముందుకు వేయడం మంచిది. లేకుంటే దానికి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇదేవిధంగా హైకోర్టులో ఎదురుదెబ్బలు తినే అవకాశం ఉంటుంది.