మహేష్ బాబు, శృతి హస్సన్ జంటగా నటించిన శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ట్ అయ్యింది. అది తన సినీ కెరీర్ లోనే మంచి చిత్రమని మహేష్ బాబు అభిప్రాయపడ్డారు. అటువంటి సినిమా చేయడం తనకు చాలా తృప్తి కలిగించిందని అన్నారు. ఈ సినిమాలో కధ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం. అది చూసి చాలా మంది ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందువస్తున్నారిప్పుడు. ఒక సినిమా ద్వారా ఇతరులకి ప్రేరణ కలిగించిన మహేష్ బాబు తను కూడా స్వయంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిశ్చయించుకోవడం విశేషం. అంటే శ్రీమంతుడు ప్రభావం ఆయనపై కూడా పడిందన్నమాట!
గుంటూరు జిల్లాలో తమ స్వస్థలమయిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకొంటున్నట్లు మహేష్ బాబు చెప్పారు. శ్రీమంతుడు సినిమా విజయవంతం అయిన సందర్భంగా హైదరాబాద్ లో ఆదివారం ఒక స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మహేష్ బాబు ఈ విషయం ప్రకటించారు. నిజానికి శ్రీమంతుడు సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే బుర్రిపాలెం దత్తత తీసుకొంటే బాగుంటుందని తన బావగారు గల్లా జయదేవ్ సూచించారని కానీ ఆ సమయంలో దత్తత తీసుకొంటున్నట్లు ప్రకటిస్తే అదేదో తన సినిమా ప్రచారం కోసమే చేసానని ప్రజలు అపోహపడే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ సంగతి అప్పుడు ప్రకటించలేదని, శ్రీమంతుడు విజయవంతమయింది కనుక ఇప్పుడు ప్రకటిస్తున్నాని తెలిపారు. మరొక మూడు నెలల్లో బుర్రిపాలెం గ్రామాభివృద్ధికి అవసరమయిన ప్రణాళికను సిద్దం చేసుకొని అప్పుడు అధికారికంగా ప్రకటిస్తానని మహేష్ బాబు తెలిపారు.