మోడీ ప్రభుత్వానికి రాజ్యసభలో తగినంత బలం లేదు కనుక అక్కడ ఏదైనా బిల్లు ఆమోదింపజేసుకోవాలంటే, తప్పనిసరిగా ప్రతిపక్షాల మద్దతు చాలా అవసరం. మోడీ ప్రభుత్వం అతికష్టం మీద ప్రతిపక్షాలని ఒప్పించి జి.ఎస్.టి.బిల్లుని నిన్న రాజ్యసభలో ఆమోదింపజేసుకొంది. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడుతున్న కాంగ్రెస్, తెదేపా, వైకాపాలకి జి.ఎస్.టి.బిల్లు ఆమోదం పొందాలంటే దానికి తమ మద్దతు కూడా చాలా అవసరమని తెలుసు. కనుక దానికీ ప్రత్యేక హోదాకి ముడిపెట్టినట్లయితే కేంద్రప్రభుత్వం తప్పకుండా దిగివస్తుందని ఆలోచించాయి.
ఈ ఆలోచన మొదట కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. తెదేపా కూడా అదే సరైన పద్ధతని భావించింది. కానీ, ఏపికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, ఇతర హామీల అమలు చేయడానికి సిద్దపడినట్లు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రికి తెలపడం వలన లేదా భాజపాకి మిత్రపక్షంగా, కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందునో జి.ఎస్.టి.బిల్లుకి తెదేపా మద్దతు ఇచ్చింది. ప్రత్యేక హోదా విషయంలో తెదేపాకి చిత్తశుద్ధి లేదని, కేంద్రప్రభుత్వంతో కలిసి నాటకాలు ఆడుతోందని కాంగ్రెస్, వైకాపాలు వాదిస్తున్నాయి. ప్రత్యేక హోదా తప్ప మరి దేనికీ అంగీకరించబోమని నేటికీ అవి చాలా ఖచ్చితంగా చెపుతున్నాయి. ఆ రెండు పార్టీలకి కేంద్రప్రభుత్వంతో ఎటువంటి సంబంధాలు లేవు. కనుక వాటికైనా ప్రత్యేక హోదా సాధించాలనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే, ప్రత్యేక హోదా ఇస్తేనే జి.ఎస్.టి.బిల్లుకి మద్దతు ఇస్తామని ఖరాఖండిగా చెప్పినట్లయితే నిన్న రాజ్యసభలో దానికి మోక్షం లభించేది కాదు. కానీ అవి కూడా జి.ఎస్.టి.బిల్లుకి అనుకూలంగా ఓటేసి గెలిపించాయి. కనుక ఇప్పుడు తెదేపా కూడా ప్రత్యేక హోదాపై వాటి నిజాయితీని ప్రశ్నిస్తోంది.