మొత్తంమీద నందమూరి బాలకృష్ణ ప్రత్యేకహౌదాపై నోరు విప్పి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే వున్నాయి. ప్రత్యేక హౌదా కోసం ఎవరినీ బతిమాలాల్సిన అవసరం లేదని ఆయన అన్న మాటలు బావ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తగలవా? ఎందుకంటే రక్తం మరుగుతుందని అంటూనే చంద్రబాబు చివరకు వచ్చేసరికి వినతులతో చర్చలతో సరిపెడుతున్నారు. రాజ్యసభలో అంత గట్టిగా తిరస్కారం వినిపించిన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రెండు రోజుల్లో ఏదో పరిశీలిస్తామనే పల్లవి ఆలపించగానే పరవశించవలసిన అవసరం లేదు. అవకాశమూ లేదు. ఎందుకంటే జైట్టీగాని మరో నాయకుడు ఇంతవరకూ ప్రత్యేక హౌదా అన్న మాట ఉచ్చరించి ఇస్తామని చెప్పిందే లేదు. ఎపితో వుంటాం, అభివృద్ధికి సహకరిస్తాం ఇలాటి మాటలు చాలా కాలంగా చాలాసార్లు వింటూనే వున్నాం. గుడుగుడుగుంచాలు అడినట్టు వారే కూచుని చర్చించి ఖండించి మళ్లీ చర్చించుతామంటే విశ్వసనీయత ఏమిటి? ఈ పరిస్థితుల్లో హౌదా ఇవ్వకపోతే బిజెపి రాజకీయ మూల్యం చెల్లించవలసి వుంటుందని బాలయ్య చెప్పడం బాగుంది. తెలుగువారి పౌరుషం వగైరాల గురించిన ఆయన మాటలు కూడా డైలాగుల్లా ధ్వనించినా అదేపనిగా ప్రాధేయ స్వరం వినిపిస్తున్న ప్రభుత్వానికి కనువిప్పే మరి!