తెదేపా అధికారంలోకి వస్తే కాపులకి రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికలలో హామీ ఇవ్వడం, ఆ తరువాత వారు ఉద్యమించే వరకు ఆ హామీని పట్టించుకోకపోవడం వాస్తవమే. ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో ఉద్యమం మొదలైన తరువాత కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేశారు కానీ ముద్రగడ ఒత్తిడికి తలొగ్గకుండా పద్ధతి ప్రకారం జస్టిస్ మంజునాథ కమీషన్ ఏర్పాటు చేశారు. ఆ నిర్ణయం సరైనదని ఈరోజు గుజరాత్ హైకోర్టు తీర్పుతో స్పష్టం అయ్యింది.
గుజరాత్ లో హార్దిక్ పటేల్ నేతృత్వంలో పటేల్ కులస్థులు రిజర్వేషన్ల కోసం ఉద్యమించినప్పుడు వారి ఒత్తిడికి తలొగ్గి గుజరాత్ ప్రభుత్వం వారిలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అది రాజ్యాంగ విరుద్దం అంటూ ఇవ్వాళ్ళ గుజరాత్ హైకోర్టు ఆ జీఓని కొట్టివేసింది.
ఒకవేళ చంద్రబాబు నాయుడు కూడా ఆనాడు ముద్రగడ ఒత్తిడికి తలొగ్గి కాపులకి అదే విధంగా రిజర్వేషన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఉండి ఉంటే నేడు దానిని కూడా రాష్ట్ర హైకోర్టు ఖచ్చితంగా కొట్టివేసి ఉండేది. కనుక ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సరైన నిర్ణయమే తీసుకొన్నారని చెప్పక తప్పదు.
తాజా సమాచారం ఏమిటంటే, ఈరోజే ముద్రగడ పద్మనాభం చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన గడవు దగ్గర పడుతోందని హెచ్చరిస్తూ ఒక లేఖ వ్రాశారు. మొదటిసారి తను దీక్ష చేసినప్పుడు, ఏడు నెలలోగా మంజునాథ కమీషన్ నివేదిక సిద్దం చేసి రిజర్వేషన్లపై నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని లేఖలో గుర్తు చేసి, ఆ గడువులోగా నిర్ణయం తీసుకోవాలని లేకుంటే మళ్ళీ ఉద్యమం మొదలుపెడతానని హెచ్చరించారు.