హైదరాబాద్ లోని ఘోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ పై మంగళ హాట్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. గుజరాత్ లోని ఉనా పట్టణంలో దళితులపై జరిగిన దాడిని సమర్ధిస్తూ ఆయన జూలై 30న ఫేస్ బుక్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. అందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి. రామ్ ప్రసాద్ మంగళ హాట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో, పోలీసులు ఆయనపై ఐపిసి సెక్షన్: 153ఏ క్రింద కేసు నమోదు చేశారు.
గుజరాత్ లో దళితులపై జరిగిన దాడి కారణంగా గుజరాత్ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం రెండూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులని ఎదుర్కొంటున్నాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్ష పార్టీలు ఆ సంఘటనపై రాజకీయాలు చేయడం మొదలుపెట్టాయి. భాజపాపై ఇప్పటికే మతతత్వ పార్టీ అనే బలమైన ముద్ర ఉంది. ఇప్పుడు దళితులపై ఈ దాడులు కారణంగా దానిపై దళిత, బలహీన వర్గాల వ్యతిరేకి అనే ముద్ర కూడా వేసి వచ్చే ఎన్నికలలో భాజపాని దెబ్బ తీసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కనుక ఈ సమస్య నుంచి బయటపడటానికి భాజపా అధిష్టానం ప్రయత్నిస్తుంటే, భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ “దళితులపై దాడులు చేయడం సబబే..వారికి తగిన శాస్తి జరిగిందంటూ” ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టడంతో ప్రతిపక్షాల వాదనకి మరింత బలం చేకూర్చినట్లయింది.
భాజపా తెలంగాణా మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో రాజా సింగ్ తో విభేదించి చాలా కాలంగా భాజపాకి దూరంగా ఉంటున్నారు. కానీ తన పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. భాజపాకి, రాష్ట్ర నేతలకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడినప్పటికీ, ఇంతవరకు ఆయనపై ఎటువంటి క్రమశిక్షణలు చర్యలు తీసుకోలేదు కనుక నేటికీ ఆయన భాజపా ఎమ్మెల్యేగానే గుర్తింపు కలిగి ఉన్నారు. కనుక ఆయన చేసిన దళిత వ్యతిరేక వ్యాఖ్యలు భాజపాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదు అయ్యింది కనుక భాజపా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనే అవకాశం ఉంది లేకుంటే దానికే నష్టం తప్పదు.