పాపిష్టి పాకిస్తాన్ మరోసారి పాతబుద్ధి చూపింది. సార్క్ వేదిక సాక్షిగా భారత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగాన్ని సెన్సార్ చేసింది. ప్రపంచంగానీ, తన దేశ ప్రజలు గానీ ఆ ప్రసంగాన్ని వినకుండా అడ్డుకుంది. ఓ వైపు అమెరికా రక్షణ శాఖ పాకిస్తాన్ కు సహాయాన్ని నిలిపివేస్తూ బుధవారం నిర్ణయించింది. గురువారం ఐక్య రాజ్య సమితిలో పాకిస్తాన్ కు ఎదురు దెబ్బ తగిలింది. భారత్ కూడా ఇక పాక్ పిచ్చి వేషాలను ఊపేక్షించకుండా తగిన గుణపాఠం చెప్పాలనే వాదన క్రమంగా బలం పుంజుకుంటోంది.
దెబ్బమీద దెబ్బ. దీంతో పాకిస్తాన్ కు పైత్యం ప్రకోపించింది. మరింత పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఇస్లామాబాద్ లో గురువారం సార్క్ హోం మంత్రుల సమావేశాన్ని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రారంభించారు. ఆ తర్వాత రాజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు. భారత్ లో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రస్తావించారు. ఉగ్రవాదమే ప్రపంచానికి సవాలని చెప్పారు. నరహంతకులను అమర వీరులని పొగడ వద్దని పాక్ కు చురక అంటించారు. మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండరని అన్నారు. రాజ్ నాథ్ ఉగ్రవాదం అంశాన్ని ప్రస్తావిస్తారని ముందే ఊహించిన పాక్ ప్రభుత్వం, ఆ ప్రసంగాన్ని ప్రసారం చేయకుండా అడ్డుకుంది.
అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు వరసగా రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. పాకిస్తాన్ కు 300 మిలియన్ డాలర్ల సైనిక సహాయం చేయాలని గతంలో అమెరికా భావించింది. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఆ దేశానికి ఆ సహాయం చేయకూడదని బుధవారం పెంటగాన్ నిర్ణయించింది. ఈ విషయాన్ని పెంటగాన్ అధికార ప్రతినిధి స్వయంగా ప్రకటించారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా అమెరికా ప్రకటించడం విశేషం.
కాశ్మీర్ అంశాన్ని మరోసారి అంతర్జాతీయ సమస్యంగా చిత్రించడానికి పాక్ మరోసారి ప్రయత్నించింది. గురువారం ఐక్యరాజ్య సమితిలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. అయితే, కాశ్మీర్ ద్వైపాక్షిక అంశమని సమితి తేల్చి చెప్పింది. ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అనవసరమని స్పష్టం చేసింది.
ప్రస్తుతం చైనా ఒక్కటే పాకిస్తాన్ కు మద్దతిస్తోంది. అయితే, పాక్ కు మద్దతు వల్ల చైనా కూడా అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి చైనా ఆసక్తితో ఉంది. కాబట్టి, పాకిస్తాన్ కు చైనా మద్దతు క్రమంగా తగ్గవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, ఈ భూమ్మీద మరే దేశమూ మద్దతివ్వని ఉత్తర కొరియా లాగే పాకిస్తాన్ పరిస్థితి తయారైనా ఆశ్చర్యం లేదు. అప్పుడు పాక్ పై భారత్ దూకుడుగా చర్యలు తీసుకున్నా అంతర్జాతీయ మద్దతు లభించ వచ్చని దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.