ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలిలింది. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్ జి) అధికారాలను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన ఆప్ పర్కారుకు చుక్కెదురైంది. ఢిల్లీలో పరిపాలనకు సంబంధించి ఎల్ జి నిర్ణయమే ఫైనల్ అని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. అన్ని నిర్ణయాలకూ ఆయన ఆమోదం పొందాల్సిందేనని స్పష్టం చేసింది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎల్ జిని ధిక్కరిస్తూ పనిచేయడానికి కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. తరచూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటికి ఎల్ జి ఆమోదం మాత్రం పొందడం లేదు. దీంతో వాటిని ఎల్ జి రద్దు చేయడం, ఆయన్ని అడ్డుపెట్టుకుని ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేయడం పరిపాటిగా మారింది.
ఢిల్లీ ప్రభుత్వం పరిపాలన కంటే కేంద్రంతో గొడవలు పెట్టుకోవడమే పనిగా పెట్టుకుందని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. చాలా సందర్భాల్లో ఆ విమర్శలు నిజమే అనేలా ఆప్ సర్కార్ ప్రవర్తిస్తోంది. ఢిల్లీలో చాలా శాఖలున్నాయి. చాలా సమస్యలున్నాయి. అయినా, కేంద్రం పరిధిలోని శాఖల విషయంలో తరచూ ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడం వివాదాలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వ అధికారులపై ఏసీబీ విచారణకు కేజ్రీవాల్ ఆదేశించడం మరీ వివాదాస్పదమైంది. దీన్ని ఎల్ జి అడ్డుకుంటారని తెలిసీ, మోడని తిట్టడానికి దీన్ని వాడుకోవడానికే వివాదం రేపారనే ఆరోపణలు వచ్చాయి.
ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు. పైగా దేశ రాజధాని నగరం. అక్కడ రాష్ట్రపతితో సహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వీవీఐపీలు ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, అనేక వ్యవస్థలు అక్కడే ఉన్నాయి. కాబట్టి శాంతిభద్రతలు సహా అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వానిదే నిర్ణయాధికారం. అలాగే ఎల్ జి అనుమతితోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాలనేది రాజ్యాంగం నిర్దేశించిన విషయం. ఈ విషయం తెలిసీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పుడు ఎల్ జి అధికారాలను ప్రశ్నిస్తూ ఏకంగా కోర్టుకే వెళ్లడం ద్వారా ఓ రకమైన యుద్ధానికి సిద్ధపడిందనే విమర్శలు వచ్చాయి.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ పూర్తి స్థాయి రాష్ట్రాలు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ప్రభుత్వాల నిర్ణయాలకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి. మిగతా విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఉంది. అయినా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో గవర్నర్ ను కలుస్తారు. ఆ హోదాను గౌరవిస్తారు. సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తారు. కాబట్టి ఏ వివాదమూ లేదు. ఈపాటి ఆలోచన కూడా కేజ్రీవాల్ కు లేదు. ఎల్ జి తో గొడవ పడటానికే ఈయన ముఖ్యమంత్రి అయ్యారా అనిపిస్తే అది మన తప్పు కాదు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో కేజ్రీవాల్ సగం ముఖ్యమంత్రే అని రూఢి అయినట్టు కామెంట్స్ మొదలయ్యాయి. ఆప్ కు తీర్పు మింగుడు పడని విషయమే. అందుకే దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.