వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం నెల్లూరులో ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ప్రత్యేక హోదాకే ఎవరు మద్దతు ఇస్తారో వారికే కేంద్రంలో మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఆయన ఈ సమయంలో ఆవిధంగా ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మోడీ ప్రభుత్వానికి లోక్ సభలో పూర్తి మెజార్టీ ఉంది. కనుక వైకాపా మద్దతు అవసరమే ఉండదు. మరో రెండున్నరేళ్ళ వరకు లోక్ సభకి ఎన్నికలు జరుగవు. కనుక ఇప్పుడు ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారనే ఆలోచనలు కూడా అసంబద్ద ఆలోచనే అవుతుంది.
కానీ జగన్మోహన్ రెడ్డి ఆవిధంగా ఎందుకు అన్నారు? అని ఆలోచిస్తే, డానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఆయన కాంగ్రెస్ పార్టీకి సానుకూల సంకేతం ఇస్తున్నట్లుగా అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరించడం లేదని స్పష్టం అయ్యింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రత్యేక హోదాకి బేషరతుగా మద్దతు ప్రకటిస్తోంది. దాని కోసం పార్లమెంటులో గట్టిగా పట్టుబడుతోంది. కనుక కాంగ్రెస్ పార్టీ అదే మాట నిలబడేమాటయితే వచ్చే ఎన్నికలలో దానితో చేతులు కలిపేందుకు సిద్దమని జగన్ సూచిస్తున్నట్లు అనుమానించవలసి ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ కూడా వైకాపాతో చేతులు కలిపేందుకు గత రెండేళ్లుగా తహతహలాడుతోంది. అందుకోసం తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వాటిని రెండు పార్టీలు దృవీకరించలేదు. కానీ భవిష్యతులో అవి చేతులు కలిపినా ఆశ్చర్యం లేదని జగన్ మాటలు సూచిస్తున్నాయి.
ఇక రెండవ కారణం ఏమై ఉండొచ్చు అంటే, తెదేపా-భాజపాలు విడిపోతే భాజపాతో చేతులు కలపవచ్చని జగన్మోహన్ రెడ్డి చాలా ఆశగా ఎదురుచూస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. కానీ ప్రత్యేక హోదాపై ఇంత గొడవ జరిగినప్పటికీ ఆ రెండు పార్టీల మధ్య బంధం పటిష్టంగానే ఉండటం బహుశః జగన్మోహన్ రెడ్డిని చాలా నిరాశపరిచి ఉండవచ్చు. కనుక వచ్చే ఎన్నికలలో భాజపాకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీతో తాము చేతులు కలుపబోతున్నామని, కనుక తమతో స్నేహం కావాలో వద్దో ఇప్పుడే ఆలోచించుకోమని భాజపాకి, మోడీ ప్రభుత్వానికి సందేశం పంపుతున్నట్లుగా కూడా భావించవచ్చు. దీనిపై నేడోరేపో కాంగ్రెస్ పార్టీ స్పందిస్తే మరింత స్పష్టత రావచ్చు.