సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దేవినేని నెహ్రు, ఆయన కుమారుడు దేవినేని అవినాష్ త్వరలో తెదేపా గూటికి చేరుకోబోతున్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావుతో నెహ్రూ నిన్న సమావేశమయ్యి తెదేపాలో చేరడం గురించి చర్చించారు. వారే కాకుండా కృష్ణా జిల్లాకే చెందిన మరో ప్రముఖ కాంగ్రెస్ నేత బూరగడ్డ వేదవ్యాస్, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉగ్రనరసింహా రెడ్డి మరికొందరు నేతలు కృష్ణా పుష్కరాల తరువాత తెదేపాలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు.
వారందరూ తెదేపాలో చేరితే జిల్లాలో పార్టీ ఇంకా బలపడుతుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. కృష్ణా జిల్లా తెదేపాకి పుట్టినిల్లు, కంచుకోటవంటిదే అయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా దానికి గట్టి సవాలే విసురుతున్నారు. కనుక నెహ్రు,వేదవ్యాస్ తదితరులు చేరికతో వైకాపాని జిల్లాలో వ్యాపించకుండా గట్టిగా అడ్డుకోవచ్చు.
కానీ కృష్ణాజిల్లాలో తెదేపాకి ఇప్పటికే చాలా మంది బలమైన నేతలున్నారు. అందరికీ ఎవరి వర్గాలు వారికి ఉన్నాయి. వారి సంఖ్య చాలా ఎక్కువైపోవడంతో వారి వర్గాల మధ్య అప్పుడప్పుడు ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఆ పోరాటాలలో నెగ్గినవారు వెలిగిపోతుంటే, నెగ్గలేని వల్లభనేని వంశీ వంటి బలమైన నేతలు కూడా ఎటువంటి గుర్తింపుకి నోచుకోలేక క్రమంగా కనుమరుగు అవుతున్నారు. జిల్లాలో పార్టీ పైకి చాలా బలంగా కనిపిస్తున్నప్పటికీ ఈ ఘర్షణలు లేదా విభేదాల కారణంగా అంతర్గతంగా బలహీనంగా ఉంది. కొందరు నేతలు చాలా అసంతృప్తితో ఉన్నారు.
తెదేపాలో ఉన్న నాయకులకే తగినంత చోటులేక ఇబ్బందిపడుతుంటే ఇటీవల వైకాపా నుంచి కూడా జలీల్ ఖాన్, భూమా నాగిరెడ్డి వంటి కొందరు సీనియర్ రాజకీయ నేతలు వచ్చి చేరడంతో వారితో కూడా ఘర్షణలు తప్పడం లేదు. ఇప్పుడు దేవినేని నెహ్రూ, బూరగడ్డ వేదవ్యాస్ వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు వచ్చి చేరితే ఏమవుతుందో ఊహించుకోవచ్చు. వారు కూడా తెదేపాలో తమ ఉనికిని చాటుకోవడానికి తప్పకుండా ప్రయత్నించడం తధ్యం. వారు కూడా జిల్లా రాజకీయాలపై పట్టు కోసం ప్రయత్నించడం కూడా తధ్యం. వారు కూడా వైకాపా ఎమ్మెల్యేలతో బాటు వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఆశించడం తధ్యం.
మిగిలిన మూడేళ్ళలో ఇంకా ఎంతమంది వచ్చి తెదేపాలో చేరుతారో ఎవరికీ తెలియదు. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో శాసనసభ స్థానాలు తప్పకుండా పెరుగుతాయనే నమ్మకం కూడా లేదిప్పుడు. కనుక తెదేపాలో ఉన్న నేతలకి, ఇప్పుడు ఆ పార్టీలో చేరుతున్న నేతలకి, మున్ముందు చేరబోయేవారికీ మద్య పార్టీ టికెట్స్ కోసం పోరాటాలు తప్పక పోవచ్చు. మంది ఎక్కువతే మజ్జిగ పలుచపడుతుందన్నట్లు తెదేపాలో చేరేవారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ అందరికీ అదే నిష్పత్తిలో టికెట్స్ దక్కే అవకాశాలు కూడా తగ్గిపోతుంటాయి. కనుక తెదేపా అధిష్టానం, అందులో చేరదలచుకొన్నవారు కూడా ఇవన్నీ ఆలోచించుకొంటే మంచిది. లేకుంటే ఇప్పుడు ఏ ఉద్దేశ్యంతో తెదేపాలో చేరికలు జరుగుతున్నాయో, దానికి పూర్తి విరుద్దమైన ఫలితాలు అందరూ ఎదుర్కోవలసి రావచ్చు.