హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం టైటిల్ ఖరారయింది. ఆ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్న యువదర్శకుడు రంజిత్ ఇవాళ ట్విట్టర్లో ఈ చిత్ర వివరాలను వెల్లడించారు. కపాలి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రంలో రజనీపేరు కపాలీశ్వరన్ అని, దానినుంచి టైటిల్‌ను తీసుకున్నామని వెల్లడించారు. చెన్నైలోని మైలాపూర్‌కు చెందిన ఒక డాన్ నిజ జీవితగాధ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, రజనీ ఆ డాన్ పాత్ర పోషిస్తున్నారని సమాచారం. చిత్రం ప్రారంభంలో కథ కొద్ది సేపు మైలాపూర్‌లో నడుస్తుందని, తర్వాత మలేషియాకు మారుతుందని రంజిత్ వెల్లడించారు. కపాలిలో రాధికా ఆప్టే, ధన్సిక, ప్రకాష్‌రాజ్, కళై అరసన్కూడా నటిస్తున్నారు. సంగీతాన్ని సంతోష్ నారాయణ్ సమకూరుస్తున్నారు. చెన్నైలోని మైలాపూర్‌లో ప్రసిద్ధ కపాలీశ్వరన్ దేవాలయంలో కొలువై ఉండే మహాశివుడిని అక్కడ కపాలీశ్వరన్ అని పిలుస్తారు. కపాలి రజనీ 159వ చిత్రం. కపాలిని తమిళంలో కబాలిగా ఉచ్ఛరిస్తారు.
గత రెండు చిత్రాలు కొచ్చడయ్యాన్, లింగ్ ఘోర పరాజయం పాలవటంతో ఈ చిత్రానికి – ఎవరూ ఊహించని రీతిలో – రెండే చిత్రాలను రూపొందించిన యువదర్శకుడు రంజిత్‌ను రజనీ తీసుకున్నారు. రజనీ చిత్రాలకు సాధారణంగా ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తారు. అయితే ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ అనే యువ సంగీత దర్శకుడిని తీసుకున్నారు. ఎక్కువమంది యువకులు పనిచేస్తున్న ఈ చిత్రంలో రజనీ పాత్రమాత్రం యువకుడిది కాకపోవటం విశేషం.