హైదరాబాద్: మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో దర్శకుడు కొరటాల శివ టాప్ లీగ్‌లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా శ్రీమంతుడు అద్భుతమైన విజయం సాధించి, బిజినెస్ పరంగా ఏ రేంజ్‌కు వెళుతుందోకూడా తెలియనంతగా దూసుకెళుతుండటంతో కొరటాలకు సర్వత్రా ప్రశంశలు లభిస్తున్నాయి. అయితే నిన్న ఈనాడు పత్రిక ఆదివారం స్పెషల్‌లో కొరటాల శివ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ ఇంటర్వ్యూలో తన ప్రస్థానంగురించి చెబుతూ, ‘భద్ర’ చిత్ర కథ తనదేనని శివ చెప్పారు. బోయపాటి శ్రీను, తాను పోసాని కృష్ణమురళి ఆఫీస్ దగ్గర కలుసుకుంటుండేవాళ్ళమని, బోయపాటి దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెడుతూ మంచి కథ ఉందా అని అడిగితే ఒక కథ చెప్పానని, అదే రవితేజ హీరోగా చేసిన భద్ర అని శివ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే బోయపాటి శ్రీను ఇంతకుముందు అనేక ఇంటర్వ్యూలలో…చివరకు ఏబీఎన్ ఛానల్లో ప్రసారమైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలోకూడా భద్ర కథ తనదేనని చెప్పారు. ఆ చిత్రం రీమేక్ రైట్స్‌ను భద్ర నిర్మాత దిల్ రాజు రెండు భాషలలో అమ్మినపుడు కథకుడిగా తనకు పారితోషికం రావాలని అడిగాననికూడా పేర్కొన్నారు. మరి పరస్పరం విరుద్ధంగా ఉన్న ఈ ఇరువురి మాటలలో ఎవరిది నమ్మాలన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అంటే బోయపాటి శ్రీను డబ్బిచ్చి కొరటాల శివ కథను కొనుక్కున్నారా లేక కొరటాల శివ బోయపాటికి ఘోస్ట్ రైటర్‌గా పనిచేశారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. వీరిద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు, సాన్నిహిత్యం ఉంది కాబట్టి నాడు ఏదో అవగాహన ప్రకారం ఒక ఒప్పందానికి వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని కొరటాల శివ బయటపెట్టటంతో, ఆయన ఇది ఉద్దేశ్యపూర్వకంగానే బయటపెట్టారా లేక యథాలాపంగా చెప్పారా అన్న సందేహం కలుగుతోంది. కథని అమ్మి ఉన్నట్లయితే కొరటాల శివ తన ఇంటర్వ్యూలో భద్ర కథ తనది అని చెప్పిఉండేవారుకాదనే వాదన వినబడుతోంది. దీనిపై ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు వివరణ ఇస్తే అందరి అనుమానాలు తొలగిపోతాయి.