నిన్న గజ్వేల్, హైదరాబాద్ సభలలో కనబడిన పూర్తి భిన్నమైన వాతావరణం గమనిస్తే, తెరాస-భాజపాలు దగ్గరవుతున్నాయా? లేక వాటి మధ్య నేటికీ అంతే దూరం ఉందా?అనే అనుమానం కలుగుతోంది.
గజ్వేల్ సభలో కెసిఆర్ ప్రధాని మోడీని పొగిడితే, ఆయన కూడా కెసిఆర్ దీక్షాదక్షతలని, పరిపాలనని మెచ్చుకొంటూ చాలా పొగిడారు. ఎన్నడూ లేనివిధంగా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అవసరమైనంత సహాయం అందిస్తోందని కెసిఆర్ సభాముఖంగా ప్రకటిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని మోడీ అన్నారు. అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి విభేదాలు, అపోహలు లేవనే ఇద్దరూ స్పష్టం చేశారు.
కనుక రాష్ట్ర భాజపా నేతలు కూడా అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తారని ఎవరైనా ఆశిస్తారు. కానీ గజ్వేల్ సభ తరువాత గంట వ్యవధిలో హైదరాబాద్ లో జరిగిన సభలో పాల్గొన్న రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తో సహా రాష్ట్ర భాజపా నేతలందరూ తెరాస ప్రభుత్వ తీరుపై, ముఖ్యమంత్రి కెసిఆర్ పై చాలా తీవ్ర విమర్శలు చేశారు. అంటే తెరాస-భాజపాల మధ్య లేక వాటి మధ్య నేటికీ అంతే దూరం ఉందని అర్ధం అవుతోంది. కనుక తెరాస నేతలు, మంత్రులు కూడా మళ్ళీ యధాప్రకారం రాష్ట్ర భాజపా నేతలపై, కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చు.
కానీ ఆ రెండు పార్టీల తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికలలో అవి పొత్తులు పెట్టుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెరాసకి ఇదివరకే స్నేహహస్తం అందించారు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్మొహమాటంగా తిరస్కరించారు. కానీ నిన్న గజ్వేల్ సభలో ఆయన తీరు గమనిస్తే, భాజపాతో స్నేహానికి ఆయన కూడా సిద్దంగానే ఉన్నట్లనిపిస్తుంది. అయితే ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది కనుక ఆ రెండు పార్టీలు తమ వ్యూహం బయటపడకుండా ఈవిధంగా లోలోన స్నేహంగా వ్యవహరిస్తూనే పైకి శత్రువులులాగా నటిస్తూ ప్రజలని, ప్రత్యర్ధ రాజకీయ పార్టీలని మభ్యపెడుతున్నట్లున్నాయి.