అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి.. వీళ్లిద్దరి మధ్యనా ఉన్నట్టుండి కాంగ్రెస్ నేతలకు డిమాండ్ పెరుగుతోంది. ఇన్ని రోజులూ ఎవరికీ పట్టకుండా పోయిన వీళ్లకు పోటీలు పడి కండువాలు వేస్తున్నారు అధికార, ప్రతిపక్ష నేతలు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందే.. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని ఖాళీ చేసి పోయిన సంగతి విదితమే. అయితే అప్పట్లో కొంతమందికి తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ ల రెండింటిటిలోనూ స్థానం దక్కలేదు. మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోనే మిగిలిపోయారు.
మరి అలా మిగిలిపోయిన వారి భవితవ్యం ఏమిటో అర్థం కాని దశలో మిగిలిపోయారు. చాలా మంది కాంగ్రెస్ ను వీడినా.. అంతే స్థాయి లో ఉంటుంది కాంగ్రెస్ లో మిగిలిపోయిన నేతల సంఖ్య. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ప్రత్యేకహోదా అంశం గురించి అధిష్టానం చొరవ చూపినా పార్టీ పుంజుకునే అవకాశాలు అయితే కనపడటం లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన కాంగ్రెస్ నేతల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. కానీ.. వీరినిచేర్చుకోవడం పట్ల అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి.. చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
దశాబ్దాలుగా పార్టీలో ఉన్నవారి సంగతేమో కానీ.. పక్కపార్టీ నుంచి వచ్చే వలస నేతలకు మాత్రం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నాడు. కేవలం వైకాపా నుంచి వచ్చే వారికే కాదు, కాంగ్రెస్ నుంచి వచ్చే వారికి కూడాతెలుగుదేశంలో ప్రాధాన్యత దక్కుతోంది. స్వయంగా లోకేష్ బాబు దగ్గరుండి చర్చలు జరిపి కాంగ్రెస్ లీడర్లకు తెలుగుదేశం తీర్థం ఇప్పిస్తున్నాడు. ఈ పరంపర కొనసాగుతోంది. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యేల జంపింగులతో విసుగు చెందిన జగన్ కొన్ని చోట్ల ఖాళీలు భర్తీ చేసుకోవడానికి కాంగ్రెస్ నేతలను సంప్రదిస్తున్నాడు. అవకాశం ఉన్న వాళ్లను తన పార్టీలోకి చేర్చుకుంటున్నాడు. ఇలా రెండు ప్రధాన పార్టీల వారూ తమ కండువాలను వేసేందుకు ఉత్సాహం చూపిస్తుండటంతో ఖాళీగా ఉన్న కాంగ్రెస్ నేతలకు కొత్తడిమాండ్ మొదలైంది.