నిస్సందేహంగా జేపీ సార్ మేధావే. ఆయన చెప్పే థియరీలు గొప్పవే. వాటిని అమలు చేస్తే మంచి మంచి మార్పులు కూడా రావొచ్చు. కానీ ఆ థియరీలన్నింటినీ అమలు చేయాలంటే.. రాజ్యంగంలో మార్పు చేసుకురావడంతో పాటు.. ఎంతో తతంగం ఉంటుంది. అది అంత సులభంగా జరిగే పని కూడా కాదు. ఇలాంటి విషయాల్లో లోక్ సభలో ఏకాభిప్రాయం రావడం.. ప్రజాస్వామ్య పోకడలో మార్పు తీసుకురావడం అంత ఈజీ కాదు. మరి అన్నీ తెలిసిన జేపీ గారికి ఈ విషయం తెలియదా?
లోక్ సత్తా వ్యవస్థాపకుడు ఏమన్నాడంటే.. ప్రధానమంత్రి పీఠానికి ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని ఈయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల ఉండే సౌలభ్యాలేమిటో ఆయన వివరించారు. బాగానే ఉంది కానీ.. ఇప్పుడు అలాంటి మార్పులు సాధ్యమయ్యేవేనా? ప్రధాని పీఠాన్ని ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకురావాలంటే.. రాజ్యంగంలో మార్పు చేసుకోవాలి. దానికి ఎంత రాజకీయ తతంగం ఉంటుందో వేరే వివరించాలా?
ప్రధానమంత్రి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికవుతున్నాడా.. పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతున్నాడా.. అనే సంగతిని పక్కన పెడితే దేశానికి ఇంతకు మించిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రధానిని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికయినంత మాత్రానా అన్ని సమస్యలూ పరిష్కారం అయిపోవు కదా. ముందు స్వల్పకాలిక, చిన్నస్థాయి మార్పునైనా చూపించగలిగితే.. దీర్ఘకాలికమైన విధానాల గురించి పోరాడవచ్చు. రాజకీయావైపు వచ్చి.. కొంత ఆదరణ సంపాదించి కూడా జేపీ కొన్ని తప్పటడుగులతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అని ప్రకటించారు. మరి ఒక విధానానికి కట్టుబడి రాజకీయంగా పోరాడాల్సిన జేపీ కాడిని వదిలేసి మళ్లీ థియరీ చెప్పుకొంటూ కూర్చోవడం ఏమిటో!