కృష్ణాపుష్కరాలపవిత్రత కోసం అంటూ విజయవాడ నగరంలో మాంసం విక్రమాయాలపై నిషేధం విధించాలన్న ఏపీ ప్రభుత్వం ఆలోచనపై విమర్శలు వస్తున్నాయి. మొత్తం ఆధ్యాత్మిక శోభతో నిండిపోవడానికి మాంసంపై నిషేధం విధించడమే సరిఅని ప్రభుత్వం భావిస్తోందట. ఈ దిశగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పరమ పవిత్రంగా పుష్కరాలను నిర్వహించడానికి మాంసం వినియోగంలో లేకుండా చూసుకోవాలని భావిస్తున్నారట.
అయితే ఇప్పటికే ఈ దేశంలో రెండేళ్ల నుంచి మాంసం గొడవ సద్దుమణగడం లేదు. బీఫ్ గురించి రెండేళ్ల నుంచి రచ్చ ఆరడం లేదు. కొన్ని చోట్ల ముస్లింలపై మరికొన్ని చోట్ల దళితులపై గోమాంస భక్షణపై దాడులు జరిగాయి. హత్యలు కూడా జరిగాయి. వాటి తీరుతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మరి బీఫ్ విషయంలో అభ్యంతరాలు చెబితేనే అంత రచ్చజరిగింది. ఇప్పుడు ఏకంగా పన్నెండు రోజుల పాటు చికెన్ , మటన్ లకు కూడా దూరంగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఆదేశిస్తే.. దీనిపై హిందువుల నుంచి కూడా వ్యతిరేకతను ఫేస్ చేయాల్సి ఉంటుంది!
ఇలాంటి బలవంతం పనికి రాదని హిందువుల నుంచే ఇప్పుడు నిరసన స్వరం వినిపిస్తోంది. అలాగే చంద్రబాబు ప్రభుత్వ చిత్తశుద్ధిని కూడా ప్రశ్నిస్తున్నారు కొంతమంది. మాంసం విషయంలో అంటే నిషేధం అంటున్నారు బాగుంది కానీ, మరి మద్యం కథ ఏమిటి? అని వారు అంటున్నారు. విజయవాడ మొత్తం పన్నెండు రోజుల పాటు మాంసానికి దూరంగా ఉండాలని ఆదేశాలు సరే, మరి మద్యం మీద మాత్రం నిషేధం విధించకపోవడం ఏమిటి? అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మాంసం మీద అంటే ప్రభుత్వానికి డైరెక్టుగా ఆదాయం రాదు.. దానిపై నిషేధం అంటున్నారు, మరి మద్యం నుంచి మాత్రం ప్రత్యక్ష వసూళ్లు ఉంటాయి.. అందుకే దీనిపై నిషేధం లేదు! ఇదేనా.. పవిత్రతను కాపాడటం? అని వినిపిస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం ఏమని సమాధానమిస్తుందో!