ఇమేజ్ గురించి ఆలోచించని హీరో వెంకటేష్.
అందుకే ఆయన దగ్గర్నుంచి వైవిధ్యభరితమైన చిత్రాలొచ్చాయి. లవ్ స్టోరీలూ, ఫ్యామిలీ సినిమాలు, కమర్షియల్ కథలు… అన్నింటికీ న్యాయం చేయగలిగిన ఏకైక హీరో అయిన. రీమేక్ స్పెషలిస్టుగానూ పేరు తెచ్చుకొన్నారు. మల్టీస్టారర్ సినిమా అంటే ఎప్పుడైనా సరే, ఎవరితో అయినా సరే… ఓకే చెప్పగలిగే దమ్మున్న హీరో. అలా.. ముఫ్ఫై ఏళ్ల నుంచీ అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు బాబు బంగారం అంటూ వినోదాలు పంచడానికి రెడీ అయ్యారు వెంకటేష్. ఈ చిత్రం ఈనెల 12న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా వెంకీతో జరిపిన ముచ్చట్లు ఇవీ…
* హాయ్ వెంకీ…
– హాయ్…
* గోపాల గోపాల తరవాత చాలా గ్యాప్ తీసుకొన్నారు. ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా?
– అలాగేం లేదు. తొందర తొందరగా సినిమాలు చేసేద్దామనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. గ్యాప్ వచ్చిందేంటి? అని కూడా ఎప్పుడూ ఆలోచించను. మంచి కథ దొరకాలి. అది నాకు సూటవ్వాలి. దాని కోసం టైమ్ తీసుకొంటానంతే. బాబు బంగారం తరవాత రెండు సినిమాలు చేయబోతున్నా. కనీసం నెల రోజుల గ్యాప్ కూడా లేకుండా సినిమా మొదలైపోతోంది.
* బాబు బంగారం కథ ఓకే చేయడానికి, మారుతికి అవకాశం ఇవ్వడానికి కారణం ఏమిటి?
– టైటిల్ మాత్రమే.. కథ కూడా బంగారం లాంటిదే. చాలా జోవియల్‌గా ఉండే క్యారెక్టర్ నాది. ఇలాంటి పాత్ర చేసి చాలా కాలమైంది. నా పాత్ర అల్లరి అల్లరిగా ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. పైగా మారుతి పద్ధతైన దర్శకుడు. సిస్టమేటిక్ గా ఉంటాడు. మేమిద్దం కలసి మొదలెట్టిన రాధ సినిమా ఆగిపోయింది. ఆ ప్లేసులో మరో సినిమా చేయాలనుకొన్నాం. తను కూడా మంచి కథతో వచ్చాడు.
* నయనతారతో మీది హ్యాట్రిక్ మూవీ.. సెంటిమెంట్ కోసమే తనని తీసుకొన్నారా?
– మా పెయిర్ బాగుంటుంది. తను కూడా ప్రొఫెషనల్ యాక్టర్. ఈ పాత్రకు తనైతే బాగుంటుందనిపించింది. నయనని కథానాయికగా తీసుకొందామన్నది మారుతి నిర్ణయమే.
* నయన ప్రమోషన్లకు రావడం లేదు కదా? ఓ సీరియర్ హీరో సినిమా ప్రమోషన్లలో కథానాయిక పాలుపంచుకోవడం బాధ్యత కదా?
– ఈ సినిమా కే కాదు.. ఏ సినిమా ప్రమోషన్లలోనూ నయనతార రాదు కదా? తన కమెట్మెంట్స్ అలాంటిది. ఈ విషయంలో నయనను తప్పుపట్టలేం.
* సీరియర్ హీరోలకు కథానాయికల్ని వెదికిపట్టుకోవడం కష్టమైపోతోంది. ఈ విషయంలో మీరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
– మీరన్నది నిజమే. వయసు పెరుగుతోంది. మాకు తగ్గ హీరోయిన్లు దొరకడం లేదు. అయినా.. వెదికిపట్టుకోవాల్సిందే. సరైన హీరోయిన్లు దొరక్క సినిమాలు ఆలస్యమవుతున్నాయి కూడా.
* ఈ సినిమాలో బాగా డాన్సులు చేసినట్టున్నారు…
– (నవ్వుతూ) నా స్థాయిలో ఏదో చేశాను. యంగ్ హీరోలంతా డాన్సులు బాగా చేస్తున్నారు. వారిలో మెలికలు తిరిగిపోయే స్టెప్పులు వేయలేను.. ఐనా ఏదో ట్రై చేశా.. (నవ్వుతూ)
* మీ కెరీర్లో రీమేక్ సినిమాలే ఎక్కువ. రీమేక్ హీరోగా ఆ ఇమేజ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా?
– అదేం లేదు. నేను చేసిన రీమేక్ సినిమాలన్నీ బాగా ఆడాయి. ఓ కథ నచ్చితే ఎక్కడి నుంచైనా తీసుకోవొచ్చు. కాన్సెప్ట్ బాగుంటే ఇప్పటికీ రీమేక్ చేయడానికి నేను రెడీనే.
* ఆమధ్య రిటైర్ అయిపోవాలన్న ఆలోచన వచ్చిందన్నారు.. మరి ఏమైంది?
– రీటైర్ అయిపోవాలనుకొంటే అయిపోలేం.. అంతా విధి రాత బట్టి ఉంటుంది. సినిమాలుచేద్దామని మనం డిసైడ్ అయినా… పైవాడు వేరేలా డిసైడ్ అవ్వొచ్చు. నా చేతుల్లో ఉన్నంత వరకూ.. నా పని నేను చేసుకొంటూ వెళ్లిపోవడమే. దానికి పుల్ స్టాప్ ఎప్పుడు, ఎక్కడ పెట్టాలో అంతా పైవాడే నిర్ణయిస్తాడు.
* మీ అబ్బాయిని హీరోని చేస్తారా?
– నన్ను హీరో అవ్వాలని మానాన్నగారు ఎప్పుడూ బలవంతం చేయలేదు. నేనూ వాడ్ని ఏ నాడూ ఈ విషయంలో ఇబ్బంది పెట్టను. ప్రస్తుతం వాడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వాడికేం అవ్వాలో వాడిష్టం. బాస్కెట్ బాల్ అంటే చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. బహుశా స్పోర్ట్స్‌మెన్ అవుతాడేమో?
* ఈమధ్య మీరు కబడ్డీపై ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టున్నారు..
– బేసిగ్గా నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను చేసిన సినిమాల గురించైనా మర్చిపోతాను గానీ… స్పోర్ట్స్‌కి సంబంధించిన విషయాలు ఎప్పుడూ గుర్తు పెట్టుకొంటా. అది క్రికెట్ అయినా, హాకీ అయినా, కబడ్డీ అయినా. నాకు ఎక్కవు రిఫ్రెష్మెంట్ అక్కడే దొరుకుతుంది.
* దగ్గుబాటి వారి మల్టీస్టారర్ ఎప్పుడు?
– త్వరలోనే ఉంటుంది. ప్రస్తుతం కథలు సిద్ధం చేస్తున్నారు. ఒకట్రెండు కథలు కూడా విన్నా. అంతా ఓకే అయితే.. వచ్చే యేడాది ఉండొచ్చు.
* తదుపరి సినిమా..
– బాలీవుడ్ చిత్రం సాలా ఖదూస్ని రీమేక్ చేస్తున్నాం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.