అమరావతికి మట్టి నీళ్లు తెచ్చిన ప్రధాని మోడీ తెలంగాణకు బంగారం తీసుకొస్తారని ఎవరూ ఆశించలేదు. అయినా రాజకీయావసరాల కోసమే కెసిఆర్ ప్రభుత్వం ఎక్కడలేని హడావుడి చేసింది. అయిదు పథకాలకు అక్కడే శంకుస్థాపనలు అంకురార్పణలు చేయించింది. యాభైవేల కోట్లు కావాలని మేము అడగడం లేదని పరోక్ష బాణాలు వేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ముచ్చటగా మూడు కోర్కెలు కోరారు. ప్రేమ కావాలంటే టన్నులకొద్ది ఇవ్వగల ప్రధాని ఈ మూడుకోర్కెలు కూడా దాటేసి సూక్తులు నీతులు వినిపించి వెళ్లిపోయారు. నిజానికి ఆయన ప్రారంభించినవన్నీ పాక్షికమైనవీ, ఆలస్యమైనవే. 4 వేల మెగావాట్లతో ప్రారంభం కావలసిన విద్యుత్ కేంద్రాన్ని రెండేళ్లు ఆలస్యంగా 16 వేల మెగావాట్లతోనే మొదలుపెట్టారు.
రామగుండం ఎరువుల కర్మాగారం గత పదహారేళ్లుగా నలుగుతున్న సమస్యకాగా కెసిఆర్ కేంద్ర మంత్రిగా వున్న సమయం నుంచి అనుకుంటున్నదే. మనోహరాబాద్ కొత్తపల్లి రైలుమార్గం మరింత పాతది కాగా జరిగింది శంకుస్థాపన.మిషన్ భగీరథ కూడా ఒక వూరికి సంబంధించినదే. రెండేళ్ల రెండు మాసాల తర్వాత వచ్చి రెండు గంటలు అధికారిక కార్యక్రమానికి మరో రెండు గంటలు తమ పార్టీ బిజెపి సమావేశానికి వెచ్చించి వెళ్లిపోయారు ప్రధాని. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మామూలు మర్యాదలను మించి మోడీ పాలనను పొగిడిన తీరు చూస్తే బిజెపితో స్నేహం పెంచుకోవాలన్న తాపత్రయం కనిపించింది.నిజానికి ఆయన కెసిఆర్‌ను పెద్దగా పొగిడిందేమీ లేదు. కొత్త రాష్ట్రమైనా త్వరగా అభివృద్ధి చేశారనీ, ఎప్పుడూ నీట్ిప్రాజెక్టుల కోసం తపన పడుతుంటారని మాత్రమే మెచ్చుకున్నారు, అందుకే మోెడీ ప్రసంగం తర్వాత వేదికపై నాయకుల మొహాలు చూస్తే నిర్వికారంగానే వుండిపోయాయి. అడిగినా చప్పట్లు కొట్టని నిరాసక్తత ఆ సభలో గోచరించింది.
నిర్దిష్టత లేని నిస్సార వాక్కులతో మోడీ సందేశం ముగిసింది. ఆ విధంగా చూస్తే కెసిఆర్ పొగడ్తలే చాలా ఎక్కువవడం ఆయన స్వభావాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.పక్కనే వున్న మల్లన్నసాగర్ రైతుల ఆందోళనలు అభద్రత గురించి అధినేతలు పరోక్షంగానైనాప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2013చట్టానికి మొదట సవరణలు చేసిందే మోడీ గనక ఆయన ఈ సమస్యలో జోక్యం చేసుకోలేదన్నది స్పష్టం.
తర్వాత ఎల్బి స్టేడియంలో బిజెపి సభకు కూడా బాగానే సమీకరించారు. . మీడియాను కూడా అనుమతించాక దాన్ని అంతర్గత సమావేశం అని చెప్పడం కష్టం.పోటీ సభ అనకుండా వుండటానికే బూత్ కార్యకర్తల సమ్మేళనం అని పేరుపెట్టారు.ఈ సమావేశంలో రాష్ట్ర అద్యక్షుడు డా.లక్ష్మణ్ టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు కురిపించారు.
2019లో అధికారానికి వస్తామని కూడా ప్రకటించారు. షరా మామూలుగా వెంకయ్య నాయుడు కాంగ్రెస్‌పై సెటైర్లతో శ్లేషలతో అలరించారు. మోడీ ప్రసంగంలో దళితులపై దాడుల గురించి ప్రస్తావించడం, కావాలంటే నాపై దాడి చేయండి గాని వారి జోలికి పోవద్దని చెప్పడం ఎవరిని ఉద్దేశించిన విమర్శనో అర్థం కాదు.ఎందుకంటే గోరక్షణ పేరిట ఈ దాడులు చేసింది సంఘ పరివార్ అనుబంధ సంస్థల వారే. గుజరాత్‌లోని ఉన్ ఘటన తర్వాత ఇది మరింత తీవ్ర రూపం దాల్చి ముఖ్యమంత్రి మార్పువరకూ వెళ్లింది.ఇలాటి సమయంలో ఆయన తమ వారి చర్యలను ఖండించి ఆత్మ విమర్శ చేసుకోవచ్చు గాని మరెవరో చేస్తున్నట్టుగా నాపై చేయండి అని సవాళ్లు విసరడమేమిటి? ఇవి సంఘ పరివార్‌లోనే తన వ్యతిరేకులను ఉద్దేశించినవా? సరిగ్గా ఇదే సమయంలో ఆరెస్సెస్నాయకుడు భయ్యాజీజోషి కూడా గోరక్షణ పేరిట దళితులపై దాడి చేసిన వారితో తమకు సంబంధం లేదని ప్రకటించడం యాదృచ్చికం కాదు. అదే నిజమైతే ఖండించేందుకు ఇంత కాలం పట్టిందెందుకు? 20 శాతం దళితులున్న యుపి ఎన్నికల దృష్ట్యా బిజెపి ఆరెస్సెస్‌లు దళిత వర్గాలను బుజ్జగించే వ్యూహం చేపడతాయిన కొద్ది రోజుల కిందటే తెలిసింది. మోడీ మాటలు దానికి పూర్తి అనుగుణంగానే వున్నాయి. మరోవైపున దేశంలో కాషాయ విప్లవం రావాలంటూ మనసులో మాట బయిటపెట్టుకుంటూనే దాన్ని విద్యుత్‌వెలుగులతో పోల్చి విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తంపైన చూస్తే థేరీ హువా లేకిన్ అంధేరీ నహీ ..(ఆలస్యమైంది గాని అంధకారం కాలేదు) అన్న మోడీ పర్యటన మోత జాస్తి పూత నాస్తిగా ముగిసిందని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలకూ రిక్తహస్తం మిగల్చివెళ్లారాయన.