బ్రహ్మోత్సవంతో గొప్ప షాక్ తగిలింది మహేష్ బాబుకి. తన ఖాతాలో ఫ్లాపులు ఉన్నాయిగానీ.. మరీ ఇంత డిజాస్టర్ ఎదుర్కోలేదు. ఏ సినిమాకీ ఇన్ని విమర్శలు వినలేదు. ఈ సినిమా తీసిన పీవీపీ పరిస్థితి కూడా గందరగోళంలో పడిపోయింది. అసలు సినిమాలు తీద్దామా, వద్దా అనే స్థాయిలోకి వెళ్లి తీవ్రంగా మథనపడిపోయింది. ఆ సినిమాతో ఆ సంస్థ ఆర్థికంగా నష్టపోయింది. అయితే అదే సమయంలో మహేష్ బాబు పీవీపీని ఆదుకోవడానికి ముందుకొచ్చాడు. `మీతో మరో సినిమా చేస్తా` అని అభయ హస్తం అందించాడు. బ్రహ్మోత్సవం తో నష్టపోయిన పంపిణీదారుల్ని ఆదుకోవడానికి అటు మహేష్‌కీ, ఇటు పీవీపీకీ అంతకంటే మార్గం లేకుండాపోయింది. మహేష్‌తో మరో సినిమా చేస్తా.. అని చెప్పి పంపిణీదారుల బెడద కాస్త తగ్గించుకొంది పీవీపీ సంస్థ. ఇప్పుడు అందుకు రంగం సిద్దమవుతోంది కూడా.
వంశీపైడిపల్లి మహేష్ కి ఓ కథ చెప్పడం, దాన్ని మహేష్ ఓకే చేయడం కూడా జరిగిపోయాయి. 2017లో ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ విషయాన్ని పీవీపీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ”మహేష్ కి సంబంధించిన కథ సిద్ధమైంది. అమెరికాలో ఎక్కువ భాగం తెరకెక్కిస్తాం. 2018 జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ”ని చెప్పింది. ఊపిరి తరవాత మరో సినిమా ఒప్పుకోలేదు వంశీపైడిపల్లి. అఖిల్‌తో సినిమా చేద్దామనుకొన్నా వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతానికైతే మహేష్ సినిమాపైనే ఫోకస్ పెట్టాడట. ఈ సినిమాతో అయినా బ్రహ్మోత్సవం బాకీలు తీరిపోతాయోమో చూడాలి.