ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి తెలంగాణా వస్తునప్పుడు రాష్ట్రానికి ఏవో వరాలు ప్రకటిస్తారని అందరూ ఆశగా ఎదురు చూశారు. వచ్చేటప్పుడు ఆయన రాష్ట్రానికి చాలా బహుమానాలు తీసుకురాబోతున్నారని రాష్ట్ర భాజపా నేతలు కూడా చెప్పారు. కానీ ఆయన తెలంగాణాకి ఏ వరాలు ఇవ్వలేదు. ఆవు కధ చెప్పి వెళ్లిపోయారు. అంతే! అంత మాత్రం దానికి కెసిఆర్ ఆయనని చాలా పొగిడేశారని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకవిధంగా ఆ మాట నిజం కూడా. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అనుకొన్న ఐదు ప్రాజెక్టులకి శిలాఫలకాలు ఆవిష్కరించడం, బటన్ నొక్కి ప్రారంభోత్సవాలు చేయడం తప్ప నిన్నటి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా లేదా అదనంగా ప్రకటించించి ఏమీ లేదు. కానీ ఆవు కధ మాత్రం అధనంగా చెప్పారు.
ఆయన నిన్న గజ్వేల్ సభలో మాట్లాడుతూ, వ్యవసాయానికి ఆవులని, ఎద్దులని జతచేస్తే వాటి మలమూత్రాలు చక్కటి ఎరువుగా పనిచేస్తాయని, భూమిని సారవంతం చేస్తాయని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇటువంటి ప్రయోగాలు చాలా చక్కటి ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. ఆ తరువాత ప్రధాని మోడీ ఆవులు-వ్యవసాయం, గోసంరక్షణ, ఆవు గొప్పదనం వంటి కొన్ని విషయాల గురించి మాట్లాడారు. కానీ ఆయన ఉద్దేశ్యం దానిపై చాలా రాద్దాంతం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సున్నితంగా చురకలు వేయడమే. ఆ తరువాత హైదరాబాద్ లో జరిగిన భాజపా సభలో దళితులపై దాడుల గురించి మాట్లాడటం గమనిస్తే, ఆ సంగతి అర్ధం అవుతుంది. దళితులపై జరుగుతున్న దాడులని ఖండిస్తూనే దానిపై రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలని విమర్శించారు. అందుకే ఆవు-వ్యసాయం అంటూ గజ్వేల్లో కధ మొదలుపెట్టి దానిని హైదరాబాద్ లో పూర్తి చేశారు.
అయితే గజ్వేల్ సభలో మోడీ తెలంగాణా కోసం ప్రత్యేకంగా ఏమీ ప్రకటించనప్పటికీ, ఆయన నిన్న ప్రారంభించిన కార్యక్రమాలలో ఒక్క కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి తప్ప మిగిలిన నిర్మాణ పనులన్నిటికీ కేంద్రప్రభుత్వమే నిధులు సమకూరుస్తోంది. అవన్నీ కలిపి చూసుకొంటే సుమారు రూ.15-20,000 కోట్లు విలువ ఉంటాయి. కనుక ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణాకి ఏమీ ఇవ్వలేదని చెప్పడం తప్పు. అదే ఆయన అమరావతి శంఖుస్థాపనకి వచ్చినప్పుడు ఏపికి ఒక్క పైసా కూడా విదిలించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు పెట్టి వెళ్ళిపోయారు. ఆ విధంగా చూస్తే తెలంగాణాకి చాలా ఇచ్చినట్లే భావించవచ్చు.
కొసమెరుపు: ఏపి ముఖ్యమంత్రి నీళ్ళు మట్టి కావాలని అడిగారు గాబట్టి మోడీ అవే తెచ్చి ఇచ్చారు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మాకు డబ్బు వద్దు ప్రేమాభిమానాలు చాలు అన్నారు గాబట్టి మోడీ ఆయనకి అదే పుష్కలంగా ఇచ్చి వెళ్ళారు. మరి ఆయనని తప్పు పట్టడం దేనికి?