కాశ్మీర్ నెలరోజులుగా రగులుతుంటే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ రోమ్ నగరం తగులబడుతుంటే ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిలాగ వ్యవహరించారు. పరిస్థితులని చక్కదిద్దడం తన వల్ల కాకపోతే కనీసం తన వలన అవి మరింత దిగజారకుండా అయినా జాగ్రత్తపడాలి. కానీ ఆమె అదీ చేయలేదు. ఉగ్రవాది బుర్హాన్ వనీని పొరపాటున ఎన్కౌంటర్ చేశారని, అందుకు భద్రతాదళాలు కాశ్మీరీ ప్రజలకి క్షమాపణలు చెప్పుకోవాలనడం ద్వారా, ప్రభుత్వమే తప్పు చేసింది అనే భావన ప్రజలకి కల్పించారు. ఆ కారణంగా లేదా ఈ అల్లర్ల వేడి తగ్గకుండా సజీవంగా ఉంచాలనే పాక్ ఆలోచన కారణంగా బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ జరిగిన నెల రోజుల తరువాత కూడా నేటికీ కాశ్మీరులో అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో అక్కడ ప్రజలు చనిపోతూనే ఉన్నారు.
ఆ కారణంగా కాశ్మీర్ ఇప్పుడు రావణకాష్టంలాగ మారిపోయింది. దానిని ఆర్పడం ఇక తన వల్ల కాదనే గ్రహింపు కలిగిందో లేకపోతే పరిస్థితులు తన చెయ్యి దాటిపోయాయని అనుమానం కలిగిందో ఏమో గానీ మహబూబా ముఫ్తీ ఈరోజు హడావుడిగా డిల్లీకి వెళ్లి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. కాశ్మీర్ లో అల్లర్లని నియంత్రించి, పరిస్థితులని సాధారణ స్థితికి తీసుకు రావడానికి కేంద్రం సహాయం కోరారు. అంటే దానర్ధం భద్రతాదళాలని ఇంకా పెంచమని మాత్రం అయ్యుండకపోవచ్చు. వాటిని పూర్తిగా ఉపసహరించమని డిమాండ్ చేయవచ్చు. అదే చేస్తే అది ఆత్మహత్యతో సమానమే.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఒక సూచన చేశారు. కేంద్రప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి ఈ సమస్యకి రాజకీయ పరిష్కారం కనుగొనాలని సూచించారు. అంటే ముఖ్యమంత్రి మార్పు లేదా రాష్ట్రంలోని రాజకీయ నేతల సహాయంతో వేర్పాటువాదులతో చర్చలు జరపాలని వారి ఉద్దేశ్యం కావచ్చు.
కాశ్మీర్ లో జరుగుతున్న అల్లర్లని స్వాతంత్ర్య పోరాటాలని అభివర్ణిస్తున్న పాక్ ప్రభుత్వం ఆ అల్లర్ల పాల్పడుతున్న వారికి అండగా నిలబడతామని చెపుతుంటే, హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ నేత సైయద్ సలాహుద్దీన్ కరాచీలో మాట్లాడుతూ పాక్ సహకరిస్తే భారత్ పై అణ్వాయుధాలు ప్రయోగించైనా సరే కాశ్మీర్ ని స్వాధీనం చేసుకొందామని చెప్పడం గమనిస్తే, పరిస్థితి తీవ్రతని అర్ధం చేసుకోవచ్చు. కనుక వీలైనంత త్వరగా ఏదో ఒక విధంగా ఈ అల్లర్లని నిలిచిపోయేలా చేయలేకపోతే మిగిలిన కాశ్మీర్ కూడా మెల్లగా పాక్ చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం కనబడుతోంది.