అక్కినేని వాళ్లింట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఒకేసారి నాగచైతన్య, అఖిల్ లు పెళ్లికి రెడీ అయ్యారు. వీళ్లిద్దరి పెళ్లి ఒకేసారి, ఒకే వేదికపై జరగబోతున్నాయన్న గుసగుసలు వినిపించాయి. వీటిపై నాగ్ ఓ క్లారిటీ ఇచ్చారు. పెళ్లిళ్లు వేర్వేరుగా జరుగుతాయని, రెండు పెళ్లిళ్లూ ఒకే వేదికపై చేయమని నాగ్ చెబుతున్నారు. ”పెళ్లి అనేది అపురూపమైన వేడుక. అది మధుర జ్ఞాపకంలా ఉండాలి. పైగా ఓ పెళ్లి చేయడం మాటలు కాదు. రెండు పెళ్లిళ్లూ ఒకేసారి భుజాన వేసుకొని హడావుడి పడడం ఎందుకు” అంటున్నారాయన. అయితే.. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అనేది చైతూ, అఖిల్‌ల నిర్ణయానికే వదిలేశారట నాగ్. ”సినిమా కెరీర్ విషయంలో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఈ కథలు చేయ్యండి.. ఆ కథలు చేయండి..అని సలహాలు ఇవ్వలేదు. అలాంటప్పుడు జీవితంలో కీలకమైన పెళ్లి విషయంలో నేనెందుకు జోక్యం చేసుకొంటా? అదంతా వాళ్లిష్టం” అంటున్నారు నాగార్జున.
నాగ్ మాటల్లో తన పిల్లలపై తనకున్న ప్రేమ కనిపిస్తోంది. దానికి తోడు.. కాస్త అసహనమూ ధ్వనిస్తోంది. మరీ ముఖ్యంగా చైతన్య తన ఇష్టానికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల ఇప్పటికీ నాగ్ గుర్రగానే ఉన్నట్టు టాలీవుడ్ టాక్. ఎంత వద్దన్నా.. చైతూ మొండిగా వ్యవహరిస్తుండడంతో ”మీ పెళ్లిళ్లు మీకిష్టమైన వ్యక్తులతో, ఇష్టమైన టైమ్‌లో చేసుకోండి. నాన్నగా వచ్చి ఆశీర్వదిస్తా” అంటూ చేతులెత్తేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ డిసెంబరులోగా చైతూ పెళ్లి జరగడం ఖాయమని, వచ్చే యేడాది అఖిల్ పెళ్లి ఉండబోతోందని సమాచారం.