సంసారాలతో తరలివచ్చిన టూవీలర్లని, చిన్నకార్లనీ చిరునవ్వులతో ఆహ్వానిస్తున్న వియ్యంకుల కళ్ళలో స్వాగతం బోర్డులు మెరుస్తున్నాయి. అతిధుల మధ్యలో నిండు విస్తళ్ళలా పరచుకున్న వియ్యపురాళ్ళు పలకరింపుల్ని కొసరి కొసరి వడ్డిస్తూ మరి కాస్త తినండని మొహమాట పెడుతున్నారు. విసుగుని ఛేదించుకుని విరామంగా పెళ్ళికొచ్చినవారు నలుగురి మధ్య కొత్తతేజాన్ని పుంజుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వేల పెళ్ళిళ్ళ సన్నివేశం!
పెళ్ళి కళతో ఆంధ్రప్రదేశ్ సందడిసందడిగా వుంది. పుష్కరాలు జరిగే కృష్ణా తీరంలో వున్న కృష్ణా గుంటూరు జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో వివాహాలు అవసరమైన సప్లయిలు చేసే సమస్త సర్వీసు రంగమూ తీరికలేకుండా పనుల్లో నిమగ్నమైపోయివుంది.
పెళ్ళళ్ళ ఈవెంటు కారణంగానే సేవలు సర్వీసుల నిమిత్తం చేతులు మారే ఆర్జితాలు లేదా ఎకనమిక్ స్టిమ్యులేషన్ మొత్తం 4 వేల కోట్ల రూపాయల వరకూ వుంటుందని అంచనా!
ఏప్రిల్ నుంచి జులై 13 వ తేదీ వరకు మూడు నెలల మూఢంతో సరిపోయింది. ఆ తర్వాత ఈనెల 2 వరకు ఆషాడంతో సరిపోయింది. వరుసగా 5 నెలల పాటు పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. మంగళకరమైన శ్రావణమాసం రాగానే వివాహనిశ్చయ తాంబూలాలు, వెనువెంటనే వివాహాలు చకచాజరిగిపోతున్నారయి. ఆగస్టు 6న చాలా వివాహాలు జరిగాయి. 7న కూడా ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి. ఈనెల 13, 18, 20, 21, 25, 26, 27 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి.
శ్రావణ మాసంతో శుభ ముహూర్తాల సీజన్ ప్రారంభయ్యింది. పల్లెలు, పట్టణాలు… ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. బట్టల దుకాణాలు, బంగారం షాపుల నుంచి కిరాణ షాపుల వరకు అన్నీ పెళ్లివార్లతో క్రిక్కిరిసిపోతున్నాయి.
బట్టల దుకాణాలు, బంగారం షాపులు కిటికిటిలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3 వేలవరకూ పెద్ద, మధ్య, చిన్న తరహా కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు వున్నాయి. అవన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. ఇవి దొరకనివారు హోటళ్లను బుక్ చేసుకుంటున్నారు. దేవాలయాలు కూడా ఖాళీలేవు. అక్కడక్కడా రోడ్లపైనే షామియానాల్లోనే పెళ్లిళ్లు కనిపిస్తూండటానికి ఇదొక కారణం.
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పురోహితులుకు డిమాండ్ పెరిగింది. వంటలు చేసేందుకు క్యాటరింగ్ కాంట్రాక్టర్లు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. అలంకరణ కళాకారులకు కూడా డిమాండ్ ఏర్పడింది. దీంతో అందరూ అధిక రేట్లు డిమాండ్ చేస్తున్నారు.
డబ్బు మాటెలా వున్నా పెళ్ళి అనే ఫామిలీ ఈవెంటులో ప్రతిదశలోనూ హూ్యమన్ ఎమోషన్స్ కనబడతాయి. పెళ్ళి సందళ్ళలో అమ్మాయిలు యాడ్ మోడల్స్ ని సినిమా స్టార్లని మించిపోయివుంటారు. కల్యాణమంటపం అప్సరసలు మెరిసిపోతున్న ఇంద్రసభలా వుంటుంది. వధూవరుల తల్లిదండ్రులు, దగ్గరబంధువులు ఆర్ధికాంశాలతో సహా అన్ని విధాలా ”సర్దుబాట్లు” చేసుకోవడంలో ”చదువుకోని” అద్భుతమైన మేనేజీరియల్ స్కిల్స్ కనిపిస్తాయి. వేర్వేరు కుటుంబాల, యువతి, యువకులు మరో కుటుంబాన్ని నిర్మించే ఏంబియన్సే నూతనోత్సాహాన్ని పరుగులు తీయిస్తున్నట్టుంది. మళ్ళీ మళ్ళీ చిగురించే చెట్టులా జీవితం హుషారెక్కినట్టుంటుంది.