తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదివరకు ఎన్నికల సమయంలో తమ పార్టీ గురించి జోస్యం చెప్పేవారు. ఇప్పుడు తెరాస-భాజపాల గురించి చెపుతున్నారు. తమ పార్టీ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుందన్న ఆయన జోస్యం ఫలించలేదు కానీ భవిష్యత్ లో తెరాస-భాజపాల గురించి అయన చెప్పిన జోస్యం మాత్రం నిజమయ్యే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ ల తీరు చూస్తుంటే ఆ రెండు పార్టీలు పొత్తుల కోసం చాలా ఆరాటపడుతున్నట్లు అర్ధం అవుతోందని, నేడు కాకపోయినా భవిష్యత్ లో ఆ రెండు పార్టీలు తప్పకుండా చేతులు కలిపే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.
తెలంగాణాలో భాజపా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తెరాసకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని భాజపా నేతలు బింకాలు పలుకుతున్నప్పటికీ అది సాధ్యం కాదని ఇంతవరకు ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలే నిరూపించాయి. కనుక కెసిఆర్ ధాటిని తట్టుకొని నిలబడాలనే ప్రయత్నాలు చేయడం కంటే తెరాసతో చేతులు కలిపినట్లయితే, భాజపాని రక్షించుకోవచ్చునని ఆ పార్టీ అధిష్టానం భావిస్తే తప్పు లేదు. అలాగే వచ్చే ఎన్నికల తరువాత కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తే, భాజపాతో పొత్తులు పెట్టుకొని లబ్ది పొందాలని తెరాస భావిస్తే అసహజమేమీ కాదు. నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే తెరాస-భాజపాలు పొత్తులు పెట్టుకొనే అవకాశం కలిగింది. కానీ అప్పుడు తెదేపాతో భాజపా పొత్తులు పెట్టుకోవడం వలన సాధ్యం కాలేదు. తెలంగాణాలో ఆ రెండు పార్టీలు ఇప్పుడు దూరం అయ్యాయి. తెదేపా కూడా క్రమంగా బలహీనపడుతోంది. కనుక తెరాసతో పొత్తులు పెట్టుకొన్నా దాని వలన ఆంధ్రాలో తెదేపా-భాజపాల స్నేహంపై ఎటువంటి ప్రభావం పడకపోవచ్చు. కనుక భవిష్యత్ లో తెరాస-భాజపాలు చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు.