మాస్, కమర్షియల్ హీరో అంటే చాలా చాలా చాలా చేయాలి.
డాన్సులు చేయాలి.. అదిరిపోయేలా ఫైటింగులు చేయాలి.. భారీ డైలాగులు చెప్పాలి. వామ్మో… ఇన్ని చేసినా అందర్నీ ఆకట్టుకోవడం కష్టం.
కానీ మహేష్ బాబు అలా కాదు. చిన్న నవ్వుతో పడగొట్టేస్తాడు. ఆ నవ్వులో అంత మహత్తుంది. చెప్పేది చిన్న డైలాగే… అది ఆటం బాంబులా పేలుతుంది.. కలకాలం నిలిచిపోతుంది. పెద్దగా స్టెప్పులు కూడా ఏం వేయడు.
కానీ.. వెండి తెరపై తాను కనిపిస్తే చాలు కళ్లన్నీ పులకించిపోతాయి. పుణ్య నదిలో స్నానాలు చేసినట్టు పరవశించిపోతాయి. ఆ మ్యాజిక్ పేరు… మహేష్!
తెలుగు సినిమాల్లో బాలీవుడ్ మెజర్మెంట్స్ తో తిరిగేసే హీరో.. మహేష్ బాబు. ఆ అందం, ఆ ఎత్తు.. ఆ సొగసు.. అబ్బ – అతనికి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ రేంజులో ఉండడానికి కారణం అదే. పెళ్లయినా.. అమ్మాయిల మనసుల్ని కెలికేసి, అబ్బాయిలకు అసూయ పుట్టించే రేంజ్ మహేష్ బాబుది. రాజకుమారుడులో గుర్రంపై వస్తున్నమహేష్ బాబుని చూసి ఫ్రీజ్ అయిపోతారు ప్రేక్షకులు. ఒక్కడులో చార్మినార్ కంటే.. ఛార్మింగ్‌గా కనిపించినప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైపోయింది. పోకిరిలో పండుగాడులా డైలాగ్ చెప్పినప్పుడు, అతడులో సైలెంట్‌గా పంచ్ డైలాగులు పేల్చినప్పుడు ఫ్యాన్స్ అతనికి ఫిదా అయిపోయారు. తెలుగు సినిమా మార్కెట్ రేంజ్‌ని చూపించిన సినిమా పోకిరి. అది ఇప్పటికీ జనాలు చూస్తుంటారు. అది.. మహేష్ మాయ. ఓవర్సీస్లో తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరో మహేష్ బాబు. కుటుంబ ప్రేక్షకులూ… మహేష్ అంటే మమకారం పెంచుకొన్నారు. ఇంటిల్లిపాదినీ థియేటర్లకు రప్పించగల ఈ తరం హీరో ఎవరంటే… మహేష్ బాబు అనే చెప్పాలి. మొన్నటికి మొన్న శ్రీమంతుడుతో కొత్త రికార్డులు సృష్టించాడు… అభిమానుల్ని మురిపించాడు.
ఇంత స్టార్ డమ్ వచ్చినా సింపుల్‌గా ఉండడం, ఎలాంటి కాంట్రవర్సీలకూ లొంగకపోవడం మహేష్‌కే సాధ్యం. మహేష్ కంప్లీట్ ఫ్యామిలీ మెన్. షూటింగ్ లేదంటే ఇంటికే పరిమితం. ఓ ఉత్తమ భర్త.. ఉత్తమ తండ్రి లక్షణాలూ అతనిలో పుష్కలంగా కనిపిస్తాయి. ఏం చెప్పినా నిజాయతీ ధ్వనిస్తుంది. తన ఫ్లాపుల్ని, తన మైనస్సుల్ని నిర్భయంగా ఒప్పుకొనే ధైర్యం మహేష్‌కి చాలానే ఉంది. `మీరే నెంబర్ వన్` అంటే.. `ఛ… ఊరుకోండి సార్.. జోకులేయొద్దు` అంటూ సింపుల్‌గా ఆ భారాన్ని తన భుజాలపై నుంచి దించేసుకొంటాడు. ఇంత సింపుల్‌గా ఉండడం కూడా.. మహేష్ కే సాధ్యం. అందుకే… అతడంటే ఇంత క్రేజ్ ఏమో..?? ఈ రోజు మహేష్ పుట్టిన రోజు. అతని అభిమానులకు పండగ రోజు. మహేష్ ఇలానే మనల్ని ఎంటర్టైన్ చేయాలి. నెంబర్ వన్లకు కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోవాలని మనసారా కోరుకొందాం… హ్యాపీ బర్త్ డే టూ యూ మహేష్.